ashok-gajapathi-raju-was-removed-from-mansasతెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మాన్సస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజును తొలగిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాన్సస్‌ ట్రస్ట్‌కు 108 ఆలయాలు, 14,800 ఎకరాల భూములు ఉన్నాయి.

ఇందులో సింహభాగం భూములు అశోక్ గజపతిరాజు కుటుంబమే ఉదారంగా ఇచ్చింది. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే…. జగన్ ప్రభుత్వం ట్రస్ట్‌ చైర్మన్‌గా ఆనంద గజపతిరాజు కుమార్తె సంచిత గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేయించడం. నిన్న సింహాచలం ఆలయ చైర్మన్‌గా సంచిత ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

సంచిత గజపతిరాజు బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన నేతకు కాకుండా బీజేపీ నేతకు ఈ పదవి ఇవ్వడం విశేషం. రాజు గారి కుటుంబంలో చిచ్చు రేపడానికే ఇలా చేశారని కొందరి వాదన. అశోక్ గజపతిరాజు… ఆనంద గజపతిరాజు కుటుంబాల మధ్య కొంత కాలం నుండి స్పర్ధలు ఉన్నాయి. దీనితో ఇవి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

తెలుగుదేశం పార్టీ కీలక నేతను దెబ్బకొట్టడానికి దేవాలయాలలోకి కూడా రాజకీయాలను తెచ్చారు అని ఆ పార్టీ వారు ఆక్షేపిస్తున్నారు. సౌమ్యుడిగా పేరున్న అశోక్ గజపతిరాజు అడపాదడపా జగన్ ప్రభుత్వం మీద పరుషవ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. పైగా ఆయన విజయనగరం జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.