Arvind Kejriwal found coronavirus symptomsదేశంలో కరోనా కేసులు రెండున్నర లక్షలు దాటాయి. మెజారిటీ కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల నుండే నమోదు అవుతున్నాయి. ఢిల్లీలో పరిస్థితులు చెయ్యిదాటనుండడంతో ఢిల్లీ ఆసుపత్రులలో స్థానికులకే వైద్యం చెయ్యాలని ప్రభుత్వం హుకుం జరీ చేసింది. ఆ ప్రకటన చేసిన ఒక్క రోజులోనే ఢిల్లీ ముఖ్యమంత్రికి కరోనా అనుమానం అంటూ వార్తలు వస్తున్నాయి.

సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సమావేశాలన్నీ రద్దు చేసుకున్నారు. జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపించడంతో స్వీయనిర్బంధంలోకి వెళ్లారు సీఎం కేజ్రీవాల్‌. ఆయన కుటుంబ సభ్యులు కూడా హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు కేజ్రీవాల్.

రేపు కేజ్రీవాల్‌కు కరోనా పరీక్షలు చేయనున్నారు వైద్యులు. అయితే కేజ్రీవాల్ కు మామూలుగానే శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉన్నాయి. బహుశా దానికి సంబంధించే ఈ లక్షణాలు అయ్యి ఉంటాయని అధికారులు అంటున్నారు. ఒకవేళ ఆయనకు పాజిటివ్ గా తేలితే దేశంలో కరోనా బారిన పడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతారు.

కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల్లో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీలో 28,936 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 812 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో పరిస్థితి సీరియస్ గానే ఉందని చెప్పాలి.