Arvind Kejriwal embarked on another revolutionary decisionసంచలనాత్మకమైన నిర్ణయాలకు పెట్టింది పేరయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో విప్లవాత్మకమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ కార్యాలయాలలో ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టడాన్ని నిషేధిస్తూ ఓ ప్రకటన చేసారు.

ఇక నుండి ప్రభుత్వ కార్యాలయాలలో కేవలం అంబేద్కర్ మరియు భగత్ సింగ్ ఫోటోలను మాత్రమే ఉంచాలని కేజ్రీవాల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. ఢిల్లీ సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా ప్రశంసలు కురిపిస్తోంది.

ఇది ఒక్క ఢిల్లీకే కాదు, దేశమంతా పాటించాలని నెటిజన్లు ఆశిస్తున్నారు. సీఎం మారినప్పుడల్లా కొత్త సీఎం ఫోటోలను పెట్టడం అధికారులకు ఓ పని అవుతుండగా, అర్హత లేని వారు కూడా ప్రస్తుతం సీఎం పీఠంపై కూర్చుంటున్న తరుణంలో, సీఎం కుర్చీకి గౌరవాన్నిస్తూ వారి ఫోటోలను కూడా పెట్టుకోవాల్సి వస్తుందన్నది అసలు ఆవేదన.

దేశానికి నిస్వార్థమైన సేవ చేసిన వారికి గుర్తుగా వారి ఫోటోలను పెట్టుకోవడంలో తప్పులేదు గానీ, దేశ భవిష్యత్తును గానీ, రాష్ట్ర భవిష్యత్తును గానీ కాలరాసే వారి ఫోటోలు కూడా ఆ మహనీయుల పక్కన పెట్టడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయం వలన ఢిల్లీలో అయితే కేవలం మహనీయుల ఫోటోలే దర్శనమివ్వవనున్నాయి.