modi-arun-jaitleyరద్దయిన 15.44 లక్షల కోట్లల్లో దాదాపుగా 13 లక్షల కోట్లకు పైబడి విలువ గల పాత 500, 1000 రూపాయల నోట్లు ఇప్పటికే బ్యాంకులకు చేరుకోవడంతో అవాక్కైన కేంద్ర ప్రభుత్వం, కనీసం ఆ మిగిలి ఉన్న కరెన్సీనైనా కట్టడి చేసి, ఎంతో కొంత బ్లాక్ మనీని నిలువరించామని చెప్పుకోవాలని భావిస్తున్నట్లుగా కనపడుతోంది. దీంతో ఉన్నట్లుండి సోమవారం నాడు 5000 రూపాయల డిపాజిట్ తో, సరికొత్త నిబంధనను వెలువరించిన విషయం తెలిసిందే.

డిసెంబర్ 30వ తేదీ లోపు 5 వేలకు మించిన పాత నోట్లను ఒక్కసారి మాత్రమే బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని, అది కూడా ఇద్దరు బ్యాంకు అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు చెబితేనేనని సోమవారం నాడు స్పష్టం చేసిన ఆర్థిక శాఖ, ఈ నిర్ణయంపై కాస్తంత వెనక్కు తగ్గింది. 5 వేల రూపాయలు అనేది సర్వ సాధారణం కావడంతో, ఈ నిబంధనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీంతో 5 వేలకు మించిన కరెన్సీని ఒకసారి డిపాజిట్ చేసుకుంటే ఎవరూ ఎలాంటి ప్రశ్నలూ అడగబోరని తాజాగా స్పష్టం చేసింది.

అయితే ఒకే వ్యక్తి రెండోసారి వస్తే మాత్రం ప్రశ్నిస్తామని, సదరు ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్తేనే వాటిని డిపాజిట్ చేయించుకుంటారని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తాజాగా వెల్లడించారు. నోట్ల రద్దు తరువాత సాధారణ ప్రజలకు అన్ని ఇచ్చామని, చివరి క్షణాల్లో అక్రమార్కులకు అవకాశం లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే ముందుగా చెప్పిన ప్రకారం డిసెంబర్ 30వ తేదీ వరకు సమయం ఉండడంతో, ప్రజల దగ్గర కూడా పాత నోట్లు ఇంకా ఉన్నాయన్న వాదన క్రమంగా పెరగడంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు.