Arun Jaitley No Tax Temple Hundisదేశంలో ఉన్న ఫేక్ కరెన్సీ, నల్ల కుబేరులపై దండయాత్ర ప్రకటించినట్లుగా మోడీ చేసిన ప్రకంపనలు ఇప్పటికే చాలా మంది తాకాయి. చెత్తబుట్టల పక్కన సంచుల కొద్దీ అయిదు వందలు, వెయ్యి రూపాయల కట్టలు వదిలి వెళ్ళడం, వెయ్యి నోట్ల కట్టలను తగలబెట్టడం వంటి ఘటనలు చోటు చేసుకోవడం ఈ రెండు రోజుల్లో చవిచూసాయి. ఇక రాబోయే 49 రోజుల్లో ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో ఇప్పుడే చెప్పలేం.

అయితే ఇంత నల్లధనం, ఫేక్ కరెన్సీ ఇండియాలో ఉందా అంటే… అంచనా వేసిన దాని కంటే ఎక్కువ ఉంది కాబట్టే మోడీ ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నారన్న సమాధానం వెలువడుతోంది. మరి ఈ నల్లధనం అంతా వృధా కావాల్సిందేనా? అంటే ఎలాగూ తమ మందిగామధుల చేత కొంత తెల్లధనంగా మార్చుకుంటారు, మరి ఇంకా మిగిలి ఉన్న నల్లధనాన్ని ఏం చేయాలి అని తర్జనభర్జనలు పడుతున్న వారి కోసమే రెవిన్యూ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది.

దేవాలయాలలో వేసే హుండీల డబ్బును బ్యాంకులలో డిపాజిట్ చేయడంపై ఎలాంటి నిఘా ఉండదని కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది. అంతేకాదు, ఈ డబ్బు డిపాజిట్ కు పరిమితి కూడా లేదని తెలిపింది. అయితే ఇది కేవలం హుండీ ద్వారా లభ్యమైన సొమ్ముకు మాత్రమే మినహాయింపు ఉంటుందని, రెవిన్యూ శాఖ కార్యదర్శి హాస్ముఖ్ అధియా ఒక ప్రకటన విడుదల చేసారు. దేవాలయాల హుండీలకు మాత్రమే వర్తిస్తుంది తప్ప, సదరు ఆలయాల క్రింద నడిచే స్వచ్చంధ సేవా సంస్థలకు ఈ నిబంధనలు వర్తించవని, వారు ఖచ్చితంగా రికార్డులు చూపించాలని తెలిపింది.

అంటే పరోక్షంగా నల్లకుబేరులకు మరో అవకాశం లభించినట్లే కదా! పాపం కడిగేసుకునే వారు ప్రస్తుతం ఉన్న దేవాలయాలలో తన నల్లధనాన్ని ఇస్తే… రేపటికి ఇంకెన్ని ఆలయాలు, హుండీలు పుట్టుకొస్తాయో అంటూ మరో ప్రశ్న వెలువడుతోంది. ఎందుకంటే… మనదేశంలో దేవుళ్ళకు, నల్ల కుబేరులకు కొరత లేదు కదా! ఇండియాలో ఏది ఎప్పుడు ఎలాగైనా జరుగుతుంది కదా! అంత స్వాతంత్ర్యం ఒక్క ఇండియాకే సొంతం!