Arun Jaitley, Arun Jaitley Cheated AP, Arun Jaitley Cheated Andhra Pradesh, Arun Jaitley Cheated Andhra Special Status, Arun Jaitley Special Status Gimmicks ఏపీకి దక్కాల్సిన “ప్రత్యేక హోదా”పై ఢిల్లీ వర్గాలలో హాట్ హాట్ చర్చలు జరిగాయి. ఓ పక్కన రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్, కేవీపీ, అరుణ్ జైట్లీ తదితరులు చర్చలు జరపగా, మరో పక్కన ఢిల్లీ విచ్చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారు. ‘స్పెషల్ స్టేటస్’పై ఒక్కొక్కరి విధానం…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాటలు…

ఆనాడు ప్రధాని హోదాలో విభజన బిల్లును ఆమోదిస్తున్న వేళ, తాను ఆరు హామీలను ఇచ్చానని గుర్తు చేస్తూ.., నాటి ప్రభుత్వం చట్టసభల్లో ప్రకటించిన హామీలను నేటి ప్రభుత్వం విమర్శించడం తగదని… దీని వల్ల పార్లమెంటుపై ప్రజలకున్న నమ్మకం పోతుందని… వెంటనే బీజేపీ తానిచ్చిన ఆరు హామీలనూ నెరవేర్చాలని, అందులో భాగంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ను మంజూరు చేయాలని కోరారు. తాను హామీలు ఇస్తున్న సమయంలో… నేటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా సభలో ఉన్నారని, సభ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేసి, సభ గౌరవాన్ని కాపాడాలని సూచించారు.

ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన కేవీపీ ప్రసంగం…

‘ప్రత్యేక హోదా’ అంశం విభజన చట్టంలో లేదని పదేపదే బీజేపీ చెబుతుండటాన్ని తప్పుబట్టిన కేవీపీ, అసలు హోదా ఇవ్వడానికి చట్టం ఎంతమాత్రమూ అవసరం లేదని అన్నారు. బీజేపీ తప్పించుకుని పోవాలని భావిస్తూ… తాను పెట్టిన ప్రత్యేక హోదా బిల్లును ద్రవ్య బిల్లుగా అరుణ్ జైట్లీ చూపడం అత్యంత దారుణంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ద్రవ్య బిల్లుగా వేటిని పరిగణించవచ్చో సూచించే రాజ్యాంగ నిబంధనలను చదివి వినిపించారు. హోదాపై స్వయంగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలని… ఏపీ ప్రజలు, వారి భవిష్యత్తుతో ఆటలాడకుండా, వెంటనే హోదాను ప్రకటించాలని, బిల్లుపై వెంటనే డివిజన్ చేబట్టాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు…

ప్రత్యేక హోదా బిల్లు కచ్చితంగా మనీ బిల్లేనని.., మనీ బిల్లులపై రాజ్యసభలో చర్చ చేపట్టవచ్చుగానీ, ఎలాంటి ఓటింగులకూ ఆస్కారం ఉండదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ఒక బిల్లు మనీ బిల్లు అవునా? కాదా? అన్న విషయమై అనుమానాలు తలెత్తితే, లోక్ సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ (స్పీకర్) నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని తెలిపారు. ద్రవ్య బిల్లులన్నీ తొలుత లోక్ సభలో మాత్రమే చర్చకు రావాలన్న రాజ్యాంగ నిబంధనలను జైట్లీ చదివి వినిపించారు.

రాజ్యసభలో చట్టాలు చేయడం ఎట్టి పరిస్థితుల్లో కుదిరే పని కాదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే ఆలోచన తమకు ఎట్టి పరిస్థితుల్లో లేదని ఏపీ ప్రజలపై చెంప మీద కొట్టినట్లు మాట్లాడారు. కేవీపీ ప్రైవేటు హోదా బిల్లుతో ఏపీకి ప్రత్యేక హోదా రాదని, చర్చలు, ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు, డిమాండ్లు, కేంద్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో మౌలిక వసతులు వంటి ఎన్నో కీలక అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయని, ఏపీకి అవసరమైన అన్ని సహాయాలు చేస్తామని, ఒక ప్రత్యేక హోదా తప్ప అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు జైట్లీ.

మోడీ సమక్షంలో చంద్రబాబు ఆవేదన…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే ప్రక్రియ ఎంత ఆలస్యమైతే ప్రజల్లో అంత మేరకు నమ్మకం పోతుందని, త్వరగా నిర్ణయం తీసుకోకుంటే టీడీపీ, బీజేపీలకు నష్టమని చెప్పానని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల అనంతరం నిర్ణయం తీసుకుంటామని మోడీ తనకు హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

బాబు మాటలకు మోడీ కౌంటర్…

హోదా గురించి ప్రస్తావిస్తూ, ఆర్థిక ఇబ్బందుల గురించి చంద్రబాబు ప్రధానికి వివరించిన వేళ, కేంద్ర ఖజానా సైతం ఖాళీగానే ఉందని, అదనపు కేటాయింపులు జరిపే అవకాశాలు లేవని, ఏపీలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో కేంద్రం పరిస్థితి కూడా అలానే ఉందని మోడీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిలదొక్కుకున్న తరువాత ఏపీకి అనుకున్నవన్నీ చేసి పెడతామన్న ఒక్క భరోసా తప్ప, అందుకు నిర్దిష్ట సమయం, కార్యాచరణను మోడీ చెప్పలేదని తెలుస్తోంది.

చివరగా…

ఇలా ప్రత్యేక హోదా చుట్టూ రాజకీయం బొంగరంలా తిరుగుతోంది. మాజీ ప్రధాని నుండి ఇప్పటి ప్రధాని వరకు సాగిన ఎపిసోడ్ లో స్పష్టంగా తేలిన విషయం ఏమిటంటే… ఆర్ధికమంత్రి వర్యులు అరుణ్ జైట్లీ ఏపీ ప్రజలకు ఓ స్పష్టత ఇచ్చేసారు. ఇప్పటికే అనేక సందర్భాలలో అరుణ్ జైట్లీ పరోక్ష వ్యాఖ్యలు చేయగా, తాజాగా ‘ఏదైనా చేస్తాం… ఒక్క స్పెషల్ స్టేటస్ తప్ప…’ అని చెప్పేశారు. సరే దానినే ఆధారంగా చేసుకుని, ‘ప్రత్యేక హోదా’ను పక్కన పెట్టి ‘ప్రత్యేక ప్యాకేజ్’ ఇవ్వమని విజ్ఞప్తి చేస్తే… అప్పుడూ కూడా ‘ఏదైనా చేస్తాం… ప్రత్యేక ప్యాకేజ్ తప్ప…’ అని చెప్తారేమో..!