Arrest warrant for tamil actor jai“జర్నీ” సినిమాతో ప్రేక్షకులకు సుపరిచితం అయిన హీరో జై ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నారు. గత నెల 21వ తేదీన మద్యం సేవించి కారు నడుపుతూ అడయారు బ్రిడ్జ్ సమీపంలో ఓ గోడను డీ కొట్టగా, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సైదాపేట మేజిస్ట్రేట్ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసారు. ఈ కేసులో 3వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సిందిగా కోర్టు ఇచ్చిన ప్రతిని హీరో జై అందుకున్నప్పటికీ, కోర్టుకు హాజరు కాలేదు.

దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి, మరో రెండు, మూడు రోజుల్లో కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ శుక్రవారం లోపున కోర్టుకు రావాలని చేసిన ఆదేశాలను కూడా జై బేఖాతరు చేయడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసారు. జై అజ్ఞాతంలో ఉన్నట్లుగా పోలీసులు కోర్టుకు తెలుపగా, ఈ కేసును 10వ తేదీకి వాయిదా వేస్తూ, జై ను అరెస్ట్ చేసి మరో రెండు రోజుల్లో కోర్టులో ప్రవేశపెట్టాలని మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది.

తమిళ హీరోగా రంగప్రవేశం చేసిన జై, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ముఖ్యంగా ‘జర్నీ’ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జై, ఆ తర్వాత ‘రాజా రాణీ’ సినిమాతోనూ అలరించాడు. అలాగే టాలీవుడ్ బ్యూటీ అంజలితో ప్రేమాయణం సాగిస్తున్నాడని గత కొంతకాలంగా వస్తున్న వార్తలూ బహిరంగమే. అంజలితో నటించిన “బెలూన్” సినిమా తెలుగు ఫస్ట్ లుక్ రెండు రోజుల క్రితం విడుదలైన విషయం తెలిసిందే.