Arjun Reddy Latest Collections reportబాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ గా మారిన విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” సినిమా, ఇంకా తన హవాను కొనసాగిస్తోంది. ఓ పక్కన నందమూరి నటసింహం బాలకృష్ణ “పైసా వసూల్” సినిమా విడుదలైనప్పటికీ, దానికి గట్టిపోటీ ఇవ్వడమే కాదు, ఆ సినిమా ఓపెనింగ్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ “అర్జున్ రెడ్డి” సినిమానే డామినేట్ చేసే విధంగా వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 40 కోట్ల మార్క్ ను అందుకున్న ఈ సినిమా, అటు యుఎస్ లో కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.

అతి తక్కువ ధియేటర్లలో విడుదలై 1 మిలియన్ మార్క్ ను అందుకున్న సినిమాగా రికార్డులకెక్కిన “అర్జున్ రెడ్డి” తాజాగా 1.5 మిలియన్ ‘ల్యాండ్ మార్క్’ను సొంతం చేసుకున్నాడు. మరో విశేషం ఏమిటంటే… అమెరికన్ బాక్సాఫీస్ వద్ద “పైసా వసూల్” కంటే ఎక్కువ కలెక్షన్స్ ను “అర్జున్ రెడ్డి” సొంతం చేసుకున్నాడు. దీంతో రాబోతున్న వీకెండ్ నాటికి 2 మిలియన్ డాలర్స్ ను అందుకుంటాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత జోరు చూస్తుంటే… 2 మిలియన్ మార్క్ ను అందుకోవడం అసాధ్యమేమీ కాదు అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఇదే జరిగితే… టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్లకు సైతం సాధ్యం కాని రికార్డును విజయ్ దేవరకొండ సొంతం చేసుకున్నట్లే భావించవచ్చు. “పెళ్లి చూపులు” సినిమాతో 1 మిలియన్ క్లబ్ లో చేరిన విజయ్, “అర్జున్ రెడ్డి”తో 2 మిలియన్ మార్క్ అందుకుంటే… ఓ రకంగా యుఎస్ మార్కెట్ లో తన ‘బ్రాండ్’ను ఏర్పాటు చేసుకున్నట్లే భావించవచ్చు. ఒకవేళ ఆ మ్యాజిక్ ఫిగర్ అందుకోవడంలో విఫలమైనా, ‘అర్జున్ రెడ్డి’ రికార్డులను తక్కువ చేయడానికి వీల్లేదు.