Are the collectors also party workers in andhra pradeshరాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగన్ వైసీపీ నాయకులకు.., మంత్రులకు “గడప – గడపకు మన ప్రభుత్వం” అనే కార్యక్రమాన్ని రూపందించి ఆచరణలో పెట్టమని ఆదేశించారు. అయితే ప్రభుత్వ ఆలోచనలన్నీ ఆరంభ సురత్వాలే అని మరోసారి రుజువు చేసుకోవడానికి సిద్ధమైంది అధికార వైసీపీ ప్రభుత్వం.

మూడు రాజధానులు అంటూ ఆర్బాటంగా హడావుడి చేసి చివరకు ఇరవైఆరు జిల్లాలతో సరిపెట్టుకుంది. అలాగే ప్రతి గడపకు మన నాయకులు వెళ్లి ప్రభుత్వ పధకాలు..,బటన్ నొక్కుడు కార్యక్రమాల గురించి చెప్పి వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉండమంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే జగన్ తలచింది ఒకటి…, అక్కడ గ్రౌండ్ రియాలిటీలో జరుగుతుంది మరొకటి కావడం తో కంగుతిన్న నేతలు., అధినేత “మాట మార్చి….మడం తిప్పి…”. పార్టీ శ్రేణులను కాక ‘కలెక్టర్లను’….రంగంలోకి దింపాలని ఆదేశాలు జారీచేశారు.

ఇప్పటికే వాలంటీర్లు..,సచివాలయం ఉద్యోగులు.., ప్రభుత్వ ఉపాధ్యాయులు…,పోలీస్ బాసులు…ఇలా ఒక్కోక్కరు వైసీపీ కార్యకర్తలుగా మారిపోతున్న పరిణామక్రమంలో ఇప్పుడు తాజాగా కలెక్టర్ల వంతు వచ్చిందంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ప్రభుత్వం పట్ల ప్రజలలో వచ్చిన వ్యతిరేకత.., గుంతల రోడ్లతో ప్రజలు పడుతున్న ఇక్కట్లకు.., పెరిగిన విద్యుత్ చార్జీలు.., అమలవుతున్న కరెంటు కోతలతో…, కొత్తగా వచ్చిన చేరిన చెత్త పన్నుల భారంతో.., నానాటికి పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో…, ప్రభుత్వ పథకాల కోతలతో విసుగు చెందిన ప్రజలు ఎక్కడ తగ్గేదెలా అన్నట్లు మంత్రులను సైతం వదిలిపెట్టకుండా నిలదీస్తున్నారు.

ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక…, చేసేదేమి లేక చివరకు చేతులెత్తేసారు సదరు నేతలు. మంత్రుల వ్యధలు విన్న ముఖ్యమంత్రి తన పార్టీ కార్యకర్తల మాదిరి గడప _ గడపకు మన ప్రభుత్వం బాధ్యతను కలెక్టర్ల చేతిలో పెట్టారు. అధికార పార్టీలు చేసే రాజకీయ పథకాల ప్రచారానికి ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించడం ద్వారా రాజకీయాలలోకి కొత్త సంస్కృతులకు నాంది పలుకుతున్నారు ప్రస్తుత అధికార పార్టీ.

వాలంటీర్లు అంటే మన పార్టీ కార్యకర్తలే అంటూ పలు సందర్భాలలో వైసీపీ పార్టీ ముఖ్య నేతలు పలు బహిరంగ సభలలో పేర్కొన్నారు.కరోనా సమయంలో వైన్ షాపుల ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులను నిలబెట్టడం.., షుగర్ కంప్లెక్స్ ల వద్ద సచివాలయం ఉద్యోగులను నియమించడం.., ఇప్పుడు ఇలా ప్రభుత్వ పధకాల ప్రచారానికి కలెక్టర్లను నియమించడం చూస్తుంటే రానున్న భవిష్యత్ తరాల యువతకు ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆసక్తి కానీ…,కనీస గౌరవం కానీ ఉండదనేది కాదనలేని వాస్తవం.

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు పార్టీ కార్యకర్తలను నియమించడం ఎంత తప్పో…, అదే విధంగా పార్టీ ప్రచారాలకు ప్రభుత్వ ఉద్యోగులను నియమించడం కూడా అంతే పొరపాటవుతుంది. పార్టీని _ ప్రభుత్వాన్ని వేరు చేసి చూసిన రోజే ప్రజలకు ప్రభుత్వాల నుండి న్యాయబద్ధమైన పాలన లభిస్తుంది.