Are TDP and BJP going to collaborate again    ఆంద్రప్రదేశ్‌లో గత 5 ఏళ్ళుగా దూరమైన టిడిపి, బిజెపి నేతలు తొలిసారిగా ఇవాళ్ళ విజయవాడలో కలిశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్ము టిడిపి, వైసీపీల మద్దతు కోరేందుకు ఈరోజు విజయవాడకు వచ్చారు.

గన్నవరం విమానాశ్రయంలో సిఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆమెను సాదరంగా ఆహ్వానించారు. వారితో కలిసి ఆమె సికే కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్ళి తనకు మద్దతు ఇవ్వవలసిందిగా అభ్యర్ధించారు. ఆమెకు వైసీపీ మొదటే మద్దతు తెలిపింది. అయినప్పటికీ ఆనవాయితీ ప్రకారం ఆమె ఏపీకి వచ్చి సిఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి మద్దతు కోరగా ఆయన అంగీకరించారు.

ఆ తరువాత ఆమె విజయవాడ చేరుకొన్నారు. అక్కడ గేట్ వే హోటల్లో ఆమె గౌరవార్దం టిడిపి ఆత్మీయసమావేశం ఏర్పాటు చేసింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ముర్ముకు ఆత్మీయస్వాగతం పలికారు.

విశేషమేమిటంటే ఈ కార్యక్రమానికి ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బిజెపి నేతలు జీవియల్, మాధవ్, వాకాటి నారారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలకు షేక్ హ్యాండ్స్ ఇచ్చి ఆప్యాయంగా పలకరించారు.

అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “ద్రౌపదీ ముర్ము అట్టడుగు స్థాయి నుంచి దేశంలో అత్యున్నతస్థాయికి ఎదిగారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వం అబ్దుల్ కలాం, రాంనాథ్ కోవింద్‌లను రాష్ట్రపతి అభ్యర్ధులుగా నిలబెట్టినప్పుడు మా పార్టీ వారికి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ద్రౌపదీ ముర్ము కూడా రాష్ట్రపతిగా ఎన్నికవడంలో మేము తోడ్పడగలుగుతుండటం మాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది,” అని అన్నారు.

ఆమె గౌరవార్ధం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు, ఆమెకు మద్దతు ఇస్తున్నందుకు బిజెపి నేతలు చంద్రబాబు నాయుడుకి, టిడిపికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.

వచ్చే ఎన్నికలలో వైసీపీని ఓడించాలంటే టిడిపి, బిజెపి, జనసేనలు కలిసిపోటీ చేయాల్సిన అవసరం ఉందని జనసేనాని పవన్ కళ్యాణ్ చెపుతున్నారు. కనుక ఈ ఆత్మీయ సమావేశం తరువాత బిజెపిలో ఏమైనా మార్పు వస్తుందా? మళ్ళీ టిడిపితో చేతులు కలిపేందుకు అంగీకరిస్తుందా?లేక వైసీపీవైపు మొగ్గు చూపుతుందా?క్రమంగా తెలుస్తుంది.