చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పి 2008లో ప్రజారాజ్యంతో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినప్పుడు ఆయన ఇద్దరు సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు భరత లక్ష్మణులలా ఆయన వెన్నంటి నడిచారు. ఆయనకు అండగా నిలబడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌లాగే తాను కూడా ఆ ఎన్నికలలో భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తానని చిరంజీవి గట్టిగా నమ్మారు. కానీ కాలేదు. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే.
ఆ తరువాత రాష్ట్ర విభజన సమయంలో అంటే 2014లో ఎన్నికలకు ముందు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేనతో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చారు. కానీ చిరంజీవి తన సోదరుడికి మద్దతు ఇవ్వలేదు. అంతేకాదు.. నాగబాబుని కూడా దూరంగా ఉంచారు.
2019 ఎన్నికలలో జనసేన పోటీ చేసినప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇవ్వలేదు. కానీ అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున తమ్ముడు మద్దతు ఇస్తున్న బిజెపి, టిడిపిలకి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేశారు. రాజకీయాలు వేరు…బంధుత్వాలు, వ్యక్తిగత సంబందాలు వేరని దీనిని కూడా సరిపెట్టుకోవచ్చు.
అయితే ఇప్పుడు చిరంజీవి రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కనుక ఇప్పుడు ఆయనకు ఎటువంటి రాజకీయ పరిమితులు, అవరోధాలు లేవు. కనుక ఇప్పుడు తమ్ముడికి అండగా నిలబడవచ్చు. కానీ చిరంజీవి నోట కనీసం ‘పవన్ కళ్యాణ్’ అనే మాట కూడా వినబడటం లేదు!
కనీసం తన తమ్ముడు చేస్తున్న సినిమాల గురించి చిరంజీవి నోట చిన్న ప్రశంశ వినబడటం లేదు! ఎందుకంటే బహుశః పవన్ కళ్యాణ్ పేరెత్తితే సిఎం జగన్మోహన్ రెడ్డికి కోపం వస్తుందని, దాంతో ఏపీలో తన సినిమాల ప్రదర్శనలకు ఇబ్బందులు ఎదురవుతాయనే భయం వల్ల కావచ్చు. అంటే చిరంజీవికి తన తమ్ముడు కంటే తన సినిమాలే ముఖ్యమని భావిస్తున్నారనుకోవలసి ఉంటుంది.
అయితే చిరంజీవి తనను దూరంగా ఉంచుతూ తనకు సహకరించనప్పటికీ పవన్ కళ్యాణ్ నోట ఏనాడూ ఆయన గురించి ఒక్క ముక్క తప్పుగా వినబడలేదు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో తన సినిమాలను దెబ్బ తీయాలనుకొంటే తీసుకొమ్మన్నాడే గానీ “అన్నయ్యా… నా సినిమాలను అడ్డుకోవద్దని సిఎం జగన్‌కి కాస్త చెప్పు,” అని పవన్ కళ్యాణ్ ఏనాడూ అడగలేదు.
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు వైసీపీ ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినప్పటికీ అది హిట్ కాగా, సిఎం జగన్మోహన్ రెడ్డిని మంచి చేసుకొని చిరంజీవి ఆచార్యను విడుదల చేసుకొన్నప్పటికీ అది బోర్లా పడింది. అది వేరే సంగతి.
అయితే తనకు అవసరమైనప్పుడు నాగబాబు, పవన్ కళ్యాణ్ మరో ఆలోచన చేయకుండా వచ్చి అండగా నిలబడినపుడు, చిరంజీవి కూడా తమ్ముడికి అవసరమైనప్పుడు వచ్చి అండగా నిలబడాల్సిన బాధ్యత ఉండదా?అని ప్రశ్నిస్తే ఆయన అభిమానులకు చాలా కోపం రావచ్చు. కానీ ఇది నిజమే కదా?
అయితే చిరంజీవో…మరొకరో వచ్చి సాయపడతారని పవన్ కళ్యాణ్ ఏనాడూ ఆశించలేదు. రాజకీయాలలో అడుగు పెట్టగానే ముఖ్యమంత్రి కాలేకపోయానని చిరంజీవిలా మద్యలో కాడి వదిలేయకుండా తన ఆశయాలు, ఆలోచనలు, భావజాలం నచ్చి కలిసివచ్చే వారితో కలిసి నిబ్బరంగా ముందుకు సాగుతూనే ఉన్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో రాణిస్తారా లేదా?ముఖ్యమంత్రి అవుతారా లేదా?అనేది పక్కన పెట్టి చూస్తే ఆయనలో నిజాయితీ, కావలసినంత గుండె ధైర్యం ఉన్నాయని రాజకీయాలలోకి వచ్చి నిరూపించుకొంటున్నారు.