AR Murugadoss' Mass Star Vijay to Play 35+ Hero!టాప్ దర్శకుడు మురుగదాస్ ను ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు మరిచిపోయినా, టాలీవుడ్ మాత్రం ఎన్నటికి మరువదు అనే విధంగా ‘స్పైడర్’ సినిమా అనుభూతులను మిగిల్చాడు. దీంతో ఒకప్పుడు మురుగదాస్ మంత్రం జపించిన టాలీవుడ్ టాప్ హీరోలు కాస్త ప్రస్తుతం గమ్మున ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పట్లో రామ్ చరణ్ వంటి వారు మురుగదాస్ సినిమాలో తమకు అవకాశం ఎప్పుడు వస్తుందోనని బహిరంగంగా చేసిన కామెంట్లు తెలిసిందే. అయితే ‘స్పైడర్’ వీరి ఆలోచనలను ప్రక్షాళన చేసింది.

ప్రస్తుతం తమిళ టాప్ హీరో విజయ్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మురుగదాస్. ఇప్పటికే విజయ్ తో రెండు భారీ హిట్లు చవిచూసిన మురుగ, ఈ సినిమాను పక్కా బ్లాక్ బస్టర్ అన్న రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నట్లుగా కోలీవుడ్ టాక్. ఇటీవల రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ న్యూస్ వస్తుండడం విశేషం. సగానికి పైగా పూర్తయిన షూటింగ్ లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, మురుగ సత్తాను చాటే విధంగా ఈ సినిమా ఫలితం వస్తుందని కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తలు.

ఈ ఏడాది దీపావళి కానుకగా (తమిళులకు అత్యంత ప్రియమైన పండగ) అమావాస్య నాడు విడుదల కాబోతున్న ఈ సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. విజయ్ సరసన మరోసారి కీర్తి సురేష్ కన్నులవిందు చేయనుంది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా, కళానిధి మారన్ అత్యంత భారీ వ్యయంతో దీనిని తెరకెక్కిస్తున్నారు. వరుస హిట్లతో మాంచి ఊపు మీదున్న విజయ్ ఖాతాలో మరో హిట్టు వచ్చి చేరుతుందని అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.