AR Murugadossఇటీవల కాలంలో స్టోరీ కాపీ రైట్స్ పై జరుగుతున్న రచ్చ తెలియనిది కాదు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు ఈ సెగ బాగా తగులుతోంది. ఇదే క్రమంలో త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న మురుగదాస్ – విజయ్ ల “సర్కార్” సినిమాకు కూడా ఈ స్టోరీ సెగ తగిలింది. ఈ కధ తనదే అంటూ రచయిత వరుణ్ రాజేంద్రన్ హైకోర్ట్ కు ఎక్కడం మురుగదాస్ కు తీవ్ర ఆవేదనను మిగులుస్తోంది.

2007లోనే ఈ కధను తాను రాసుకున్నానని, అదే కధను మురుగదాస్ “సర్కార్”గా మలిచారని చెప్తూ… 30 లక్షల నగదుతో పాటు, చిత్ర క్రెడిట్ కూడా తనకు కావాలంటూ వరుణ్ కోర్టుకు వెళ్ళిన వైనంపై మురుగదాస్ తాజాగా వివరణ ఇచ్చుకున్నారు. తన జీవితంలో ఇంతవరకు వరుణ్ ను కలిసింది లేదని, తన ఆఫీస్ లో రాత్రింబవళ్ళు తన అసిస్టెంట్లతో కూర్చుని ఈ కధ కోసం కష్టపడ్డామని మురుగదాస్ తెలిపారు.

అయినా వరుణ్ 2007లోనే కధ రాసుకున్నారని చెప్తున్నారని, కానీ తన కధ వర్తమాన రాజకీయాలకు సంబంధించినదని, ఇందులో జయలలిత మరణాన్ని కూడా చూపించామని, మరి అది, ఇది ఒక్కటే ఎలా అవుతుందని ప్రశ్నించారు. అయితే ఇద్దరి కధల్లో ఉన్న సారుప్యత ఏమిటంటే… ఓట్లను ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? అన్న నేపధ్యంలో ఉంటాయని మురుగ వివరించారు.

ఈ ఘటన తనను బాగా కలచివేసిందని, ఒక్కసారిగా నా గుండె ఆగినంత పనయ్యిందని, అయినా సినిమా చూడకుండా తన కధే ఇదని వరుణ్ ఎలా అంటారని తీవ్ర ఆవేదనతో మురుగదాస్ చెప్పుకొచ్చారు. ‘సర్కార్’ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ లో విజయ్ సిగరెట్ తాగుతూ కనిపించినపుడు ఈ కధ వివాదం మొదలుకాగా, ఇపుడు సినిమా దాదాపుగా విడుదలకు చేరుకుంది.