Aqua_Holidays_in_Andhra_Pradeshసాధారణంగా వేసవి సెలవులలో విద్యాసంస్థలకు హాలీడేస్ (సెలవులు) ఇస్తారని అందరికీ తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాలకు హాలీడేస్ లభిస్తాయి. విద్యుత్‌ సంక్షోభం కారణంగా వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడేస్ ఇచ్చింది. దాంతో ఆయా పరిశ్రమల యాజమాన్యాలు తమ ఉద్యోగులు, కార్మికులకు హాలీడేస్ ఇవ్వక తప్పలేదు. ఆ తరువాత గిట్టుబాటు ధరలు ప్రకటించాలని కోరుతూ కోనసీమ రైతులు క్రాప్ హాలీడేకు సిద్దపడ్డారు. ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచడంతో రొయ్యల చెరువుల యజమానులు ఆక్వా హాలీడేకి వెళ్ళక తప్పదని చెపుతున్నారు.

ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రంలో చేపలు, రొయ్యల చెరువులకు యూనిట్‌కి రూ.1.50 చొప్పున విద్యుత్‌ అందజేయడంతో ఆక్వా రైతులు చాలా సంతోషించారు. కానీ వారి సంతోషం మూనాళ్ళ ముచ్చటే అయింది.

మండు వేసవిలో చేపల చెరువులకు విద్యుత్‌ చాలా చాలా అవసరం. సరిగ్గా ఆ సమయంలోనే పవర్ హాలీడేస్ అమలుచేసింది. అదే సమయంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. సరిగ్గా అదే సమయంలో రొయ్యల ధరలు హటాత్తుగా పడిపోయాయి.

ఒకేసారి దెబ్బమీద దెబ్బ పడటంతో ఆక్వా రైతులు నీళ్ళలో నుంచి బయటపడిన చేపల్లా విలవిలలాడారు. ఆ నష్టాలు, కష్టాలను పంటి బిగువున భరిస్తుండగా ఎట్టకేలకు ప్రభుత్వం వారిపై దయదలిచి పవర్ హాలీడే ఎత్తేసింది. కానీ నెల తిరక్కుండానే సబ్సీడీ విద్యుత్‌ ఛార్జీని యూనిట్‌కి రూ.1.50 నుంచి ఒకేసారి రూ.3.85కి పెంచేసింది.

ఐదు ఎకరాలలోపు సాగుచేస్తున్న ఆక్వా రైతులకు మాత్రం రూ.1.50 చొప్పున ఆ పైన సాగుచేస్తున్నవారికి, అలాగే ప్రభుత్వం గుర్తించిన ఆక్వా జోన్స్ వెలుపల సాగుచేస్తున్నవారు అర ఎకరంలో సాగుచేస్తున్నా యూనిట్‌కి రూ.3.85 చొప్పున చెల్లించాల్సిందే అని హుకుం జారీచేసింది. దాంతో ఆక్వా రైతులు లబోదిబోమని మొత్తుకొంటున్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 3.75 లక్షల ఎకరాలలో చేపలు, రొయ్యల సాగవుతోంది. వాటిలో 50 శాతంకి పైగా ప్రభుత్వం గుర్తించిన ఆక్వా జోన్స్ వెలుపలే సాగవుతోంది. రాష్ట్రంలో ఆక్వాసాగు చేస్తున్నవారిలో 95 శాతం మంది రైతులు 5 ఎకరాలు అంత కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే, 5 ఎకరాల కంటే తక్కువగా రొయ్యలసాగు చేస్తే వాటి నిర్వహణ ఖర్చులు కూడా రావు. కనుక రాష్ట్రంలో దాదాపు ఆక్వా రైతులందరిపై పెంచిన ఈ సబ్సీడీ విద్యుత్‌ భారం పడుతుంది.

రొయ్యల చెరువులలో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటెయిన్ చేయడం కోసం ఆజిటేటర్ యంత్రాలు వాడుతారు. అవి రోజుకి 16 గంటలు పని చేస్తూ భారీగా విద్యుత్‌ వినియోగించుకొంటాయి. అలాగే చెరువులలో కలుషితమైన నీటిని తోడి బయటకు పోయడానికి, మళ్ళీ కొత్త నీటిని నింపడానికి నీళ్ళ మోటర్లు ఉపయోగిస్తుంటారు. రొయ్యల చెరువుల వద్ద విద్యుత్‌ దీపాలు అమర్చుతారు. వీటన్నిటికీ కలిపి ఒక్కో ఎకరానికి కనీసం 10 హెచ్‌పి విద్యుత్‌ సరఫరా అవసరం ఉంటుంది.

కనీసం 5 ఏకరాలే అనుకొంటే 50 హెచ్‌పి అయ్యింది. ఈ లెక్కన 10,20,50 ఎకరాలలో సాగయ్యే చెరువులకి ఎంత విద్యుత్‌ అవసరమో ఊహించుకోవచ్చు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి విద్యుత్ ఛార్జీలు రూ.1.50 నుంచి రూ.3.85కి పెంచేయడంతో ఇక రొయ్యల చెరువులను నిర్వహించడం తలకు మించిన భారమే అవుతుందని వాపోతున్నారు. కనుక ఆక్వా హాలీడేకు వెళ్ళక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయని గూడూరుకి చెందిన ఎన్‌.సుకుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

భారత్‌ నుంచి విదేశాలకు చేపలు, రొయ్యలు భారీగా ఎగుమతి చేస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలుస్తుంది. కానీ ఇప్పుడు ఆక్వా రైతులు హాలీడేకు వెళ్ళవలసివస్తే వారు ఎలాగూ నష్టపోతారు. వారితో పాటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పన్నులు, విదేశీమారకం రూపేణ వచ్చే ఆదాయం కోల్పోతాయి.

కనుక తక్షణం పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని ఆక్వా రైతులు జగనన్న ప్రభుత్వానికి మొరపెట్టుకొంటున్నారు. మరి వారి మొర ఆలకిస్తారో లేదో?