APTF_Hrudaya_Rajఏపీలో ఉపాధ్యాయులకి నెలనెలా జీతాల చెల్లింపు కూడా ఓ వార్త అయిపోయింది. ప్రతీనెల 10వ తేదీ వరకు జీతాల కోసం ఎదురుచూపులు చూడటం, ఆ తర్వాత రోడ్లమీదకొచ్చి ర్యాలీలు చేస్తుండటం సర్వసాధారణమైన విషయమైపోయింది. ఈ నెల కూడా 10వ తేదీ వచ్చినా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో తిరుపతి జిల్లా పుత్తూరులో ఉపాధ్యాయుల సంఘాల సమాఖ్య అధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం సాయంత్రం పుత్తూరు ప్రభుత్వ ప్రధాన పాఠశాల నుంచి కార్వేటి నగరం కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.

పదో తేదీ వరకు జనవరి నెల జీతాలు పడకపోవడంతో జిల్లా పాత తాలూకా కేంద్రాలలో నిరసన దీక్షలు కూడా నిర్వహిస్తున్నామని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు హృదయారాజు, కార్యదర్శి చిరంజీవి తెలిపారు.

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో డీఈవో కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు మోకాళ్ళపై నిలిచి నిరసనలు తెలిపారు. శనివారంలోగా జీతాలు చెల్లించకపోతే నిరవదిక దీక్ష చేపడతామని డీఈవోని హెచ్చరించారు.

ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లా.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఉపాధ్యాయులు బ్యాంక్ మేనేజర్లని కలిసి తమకి జీతాలు ఆలస్యంగా అందుతున్నందున, తమ బకాయిల తేదీని 15-20 తేదీలకి మార్చవలసిందిగా కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు.

ఒకప్పుడు డీఏ బకాయిలు, పీఆర్సీల గురించి మాత్రమే ఆలోచించవలసివచ్చేదని, కానీ ఇప్పుడు నెలనెలా జీతాల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. చాలామంది ఆదాయపన్ను భారం తగ్గించుకొనేందుకు హౌసింగ్ లోన్స్ తీసుకొంటారు. ఇది వరకు ఒకటో తేదీ జీతాలు పడిపోయేవి కనుక తమ బ్యాంక్ ఖాతాల నుంచి 3-4 తేదీలలో ఋణవాయిదాలు ఆటో డెబిట్ అయ్యేలా ఏర్పాటు చేసుకొన్నారు. కానీ 10-15 తేదీలు వచ్చినా జీతాలు పడకపోవడంతో లోన్ పేమెంట్స్ బౌన్స్ అయ్యి రూ.300 నుంచి రూ.500 వరకు జరిమానాలు చెల్లించాల్సివస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ఇవికాక నెలవారి ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకి, తల్లితండ్రులు లేదా జీవిత భాగస్వాముల చికిత్సలు, మందులకి నెలనెలా చెల్లింపులు ఉండనే ఉంటాయి. ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోతే తాము ఏవిదంగా బ్రతకాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

కొసమెరుపు ఏమిటంటే, ఫిభ్రవరి 10వ తేదీ వరకు చాలా మంది ఉపాధ్యాయులకి ప్రభుత్వం జీతాలు చెల్లించకపోయినా, ఫిభ్రవరి 10వ తేదీనే సిఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పధకం కింద తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి 4,536 మంది లబ్ధిదారులకి రూ.38.18 కోట్లు ఆర్ధిక సాయాన్ని వారి బ్యాంక్ ఖాతాలలో జమా చేశారు.