APJAC President Bandi Srinivasa Rao comments on jaganజగన్ సర్కార్ అమలు చేసిన కొత్త పీఆర్సీతో ఉద్యోగ సంఘ నేతల అసలు రంగులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తగ్గిన జీతాలు ఇవ్వడంపై ప్రభుత్వంపై విరుచుకుపడిన బండి, ఆ క్రమంలో ఇన్నాళ్లు ప్రభుత్వం చెప్పినట్టుగా విన్నాము, ఆడించినట్టుగా ఆడాము అని ఒప్పేసుకున్నారు.

ఇకపై కూడా అలాగే చేస్తే తమకు బడితపూజ జరిగేలా ఉండడంతోనే నాలుగు జేఏసీలు ఒక్క తాటిపైకి వచ్చి పోరుబాట పడుతున్నామని తెలిపారు. దీంతో బండి అసలు రంగు బట్టబయలు కాగా, ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఉద్యోగులకు అండగా ఉండడం శుభపరిణామం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మరియు ఆర్ధిక మంత్రి బుగ్గనపై ఓ స్థాయిలో మండిపడ్డారు బండి.

ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మీ పీఆర్సీ డబ్బులు మా దగ్గర ఉన్నాయి, మీరు బస్తాలతో తీసుకు పొమ్మని ఎప్పుడూ చెప్పలేదు. ఏదైనా అంటే నూటికి ముప్పాతిక శాతం జీతాలకే అయిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారని, మా డబ్బులు కూడా మా పిల్లల తిండికే అయిపోతుంది, తండ్రిగా బిడ్డలకు కూడు పెట్టడం అనేది బాధ్యత, ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం అనేది మీ బాధ్యత అని సీఎంకు గుర్తు చేసారు.

ప్రభుత్వ ద్వంధ వైఖరితో వ్యవహరిస్తోంది. ఆరు నెలలుగా ఏ బిల్లులు పెట్టినా మాకు పేమెంట్ లు ఇచ్చారా? అయిదు డీఏలు ఒక్కసారే పెండింగ్ పెట్టి ఇదిగో పెరిగింది, ఇదిగో పెరిగింది అంటే ఏం పెరిగింది, నీకేమైనా జుట్టు పెరిగిందా? మాకు ఏమైనా మైండ్ పోయిందా? అనేది మాకు అర్ధం కావట్లేదు. ఆర్ధిక శాఖా మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ నువ్వెందుకు అయ్యావయ్యా? మా ప్రాణం తీయడానికి అయ్యావా?

నీ ముఖం మొన్న చూపించావు, ఇంతవరకు మేము చూడను కూడా చూడలేదు. మీకు కావాలంటే నేను లెక్కలు చూపిస్తా, జీతం పెరిగిందా? తగ్గిందా? మాకు కూడా లెక్కలు తెలుసు. యాడో పెరిగిందో, యాడ తగ్గిందో లెక్క చూడవయ్యా పెద్ద మనిషి. మీరు చెప్పినట్టుగా విన్నాం, మీరు ఆడించినట్లుగా ఆడాం, ఇక ఆడితే బడితపూజ మాకు చేసేటట్లుగా ఉంది కాబట్టి, తప్పసరిగా నాలుగు జేఏసీలు ఉద్యమంలోకి రావడం జరిగిందని బండి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో స్పందించారు.