రాష్ట్ర నిధులను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్న వైఎస్ జగన్ సర్కార్ ప్రస్తుతం కష్టాల కడలిలో కూరుకుపోతోంది. తాజాగా ఉద్యోగ సంఘాలు కూడా జగన్ సర్కార్ కు డెడ్ లైన్ ను విధిస్తూ అల్టిమేటం జారీ చేసింది. పీఆర్సీ అమలు విషయంలో జగన్ సర్కార్ జాప్యతపై మండిపడిన ఏపీజేఏసీ చైర్మన్ ఈ నెలాఖరు లోపున పీఆర్సీ అమలుపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించింది.

తమకు రావాల్సిన సదుపాయాలను కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని, అలాగే తాము దాచుకున్న డబ్బులను కూడా రానివ్వడం లేదని ఏపీజేఎసీ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ నెల 27వ తేదీ లోపున అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేసిన చైర్మన్, పీఆర్సీపై సీఎస్ చేసిన హామీలకు విలువ లేకుండా పోయిందని అన్నారు. ఏపీజేఎసీ తీసుకున్న ఈ తాజా నిర్ణయాలు జగన్ సర్కార్ ను ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

ఇప్పటికే వివిధ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులను చెల్లించలేక సతమతవుతుండగా… మరోవైపు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిధుల కొరతలో ఉన్న జగన్ సర్కార్ కు ఇపుడు ఉద్యోగ సంఘాలు కూడా ఎదురెళితే రాబోయే రోజులు మరింత దయనీయంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ప్రతి నెల ఉద్యోగులకు జీతాలను చెల్లించడానికి అప్పులు చేసి ఇస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇపుడు పీఆర్సీ అమలు అంటే అది ప్రభుత్వం మీద అత్యంత భారం పడనుంది.