APJAC employees -strikeఈ ప్రభుత్వంతో చర్చలు జరిపేదేలే… కొత్త పీఆర్సీ రద్దు చేసిన తర్వాతే ఏ మాటలైనా అని చెప్పిన ఉద్యోగులు, చెప్పినట్లుగానే భారీ ర్యాలీలతో కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీని రద్దు చేయాలి, పాత జీతాలనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్నారు.

ముందుగా ఉపాధ్యాయ సంఘాలు రోడ్ల పైకి వచ్చి కలెక్టరేట్ల ముట్టడి చేసి నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయగా, నేడు మిగిలిన ఉద్యోగ సంఘాలు కూడా ర్యాలీలో భాగస్వామ్యులు అయ్యారు. వీరితో పెన్షనర్ల అసోసియేషన్స్ కూడా జత కలవడం విశేషం. ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఓ మంత్రుల కమిటీ వేసి చర్చలకు ఆహ్వానించారు.

ఈ సమావేశానికి వెళ్ళేది లేదని స్పష్టం చేసిన ఉద్యోగ సంఘాలు, పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యుల తరపున ఓ నివేదికను ఈ సమావేశానికి పంపాలని నిర్ణయించుకున్నారు. అశుతోష్ మిశ్రా పీఆర్సీ నివేదికను అందివ్వడంతో పాటు, కొత్త పీఆర్సీ రద్దు, పాత జీతాలు ఇస్తానంటే అనుబంధ అంశాలపై చర్చకు సిద్ధపడితేనే ఆలోచిస్తామని ఓ ప్రతినిధి ద్వారా లేఖ పంపారు.

చూడబోతుంటే… కొత్త పీఆర్సీ రద్దు చేసే వరకు ఉద్యోగులు ‘తగ్గేదేలే’ నినాదంతోనే ఉన్నట్లుగా స్పష్టమైంది. ఎన్ని రోజులైనా గానీ ఈ ప్రకటన వచ్చిన తర్వాతే చర్చలని భీష్మించుకుని కూర్చున్న ఉద్యోగుల డిమాండ్ లకు జగన్ సర్కార్ తలొగ్గుతుందా? లేదా? అనేది వేచిచూడాలి. ఉద్యోగ సంఘాలు కలిసికట్టుగా ప్రభుత్వంపై పోరాడుతుండడం కలిసొచ్చే అంశం.