apjac amaravati union leaders prc issue ఉద్యోగులకు ఎలాంటి అనుకూల ప్రకటన రాకుండానే సమ్మెను విరమించిన “ఆ నలుగురు”పై ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయ సంఘ నేతలైతే రాజీనామాలు తెలిపి నిరసనలు వ్యక్తం చేయగా, ఆ నలుగురు దిష్టి బొమ్మలు తగలపెట్టడం, అలాగే శవాలను మోసుకెళ్ళడం వంటి వాటితో తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.

తాజాగా “ఆ నలుగురు”పై తెలుపుతోన్న నిరసన గురించి ఏబీఎన్ ఛానల్ ఓ కధనాన్ని ప్రసారం చేయగా, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇటీవల ఉద్యోగ సంఘాలు “ఆ నలుగురు” ముఖచిత్రాలతో కూడిన వార్షిక క్యాలెండర్ ను విడుదల చేయగా, ఆ క్యాలెండర్ ను బాత్ రూమ్ లో పెట్టడం, వాటిపై ఫినాయిల్ పోయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

విజయవాడ ప్రభుత్వ ఆఫీసులో ఈ సంఘటన చోటు చేసుకోవడం మరో విశేషం. రాష్ట్ర ముఖ్యమంత్రి కొలువై ఉన్న సమీప ప్రాంతంలోనే ఈ నిరసన వ్యక్తం కావడం అనేది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అంటోంది మీడియా. అందుకే ఉద్యోగుల సంఘ నాయకులపై క్రింది స్థాయి ఉద్యోగులలో అంత ఆగ్రహం నెలకొందనేది ఈ కధనం సారాంశం.

నిజానికి ఆ నలుగురు ముఖ్యనేతలు వైసీపీకి కోవర్టులుగా మారిపోయారనే విమర్శ గతంలోనే ఉన్నప్పటికీ, తాజాగా జరిగిన పీఆర్సీ సాధన విషయంలో దీనిపై స్పష్టత వచ్చేసిందన్నది లేటెస్ట్ ఆరోపణ. మొత్తానికి ఓ రాజకీయ నాయకుడికి లేదా ఓ సినీ సెలబ్రిటీకి దక్కే పబ్లిసిటీ ఈ పీఆర్సీ ప్రభుత్వ చర్చల ద్వారా “ఆ నలుగురు”కి వచ్చేసింది.