apcpsea-employeesసీపీఎస్ అంశంపై ఈరోజు చర్చలకు రావలసిందిగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆహ్వానించడంతో, ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు వెళ్ళాలా వద్దా? అనుకొంటూనే వెళ్ళారు. వాళ్ళు ఊహించినట్లే మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఇద్దరూ జీపీఎస్ విధానాన్ని అంగీకరించాలని మళ్ళీ ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.

దాంతో ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మద్యలో లేచి బయటకు వచ్చేశారు. జీపీఎస్‌పై చర్చలకైతే మమ్మల్ని పిలవడం దేనికి?మళ్ళీ పిలిచినా రామని ఉద్యోగ సంఘాల నేతలు మంత్రులకు మొహం మీదే చెప్పి బయటకు వచ్చేశారు.

అనంతరం ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షులు అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ, “మేము చర్చల ద్వారానే సీపీఎస్ సమస్యను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నాము. కానీ ప్రభుత్వం ముందే జీపీఎస్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించుకొని మమల్ని చర్చలకు పిలుస్తుండటం వలన ప్రయోజనం ఏమిటి? మంత్రులకు నేరుగా మా అభిప్రాయాలు చెప్పినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే మేము మిలియన్ మార్చ్ లేదా చలో విజయవాడ చేపట్టాలనుకొన్నాము.

పోలీసులు మాకు అనుమతి నిరాకరించడంతో దానిని సెప్టెంబర్‌ 11కి వాయిదా వేసుకొన్నాము. ఇదే విషయం మేము చెపుతున్నా, పోలీసులు మాపై అక్రమకేసులు బనాయించి, పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడుతూ వేదిస్తున్నారు. నేను స్కూల్లో పిల్లలకి పాఠాలు చెపుతుంటే, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి కుట్రలు పన్నుతున్నానంటూ నాపై అక్రమకేసులు బనాయించారు.

ఓ పక్క పోలీసులతో మమ్మల్ని ఈవిదంగా వేదిస్తూ, మరోపక్క చర్చలకు రమ్మనమని పిలిచి జీపీఎస్‌కు ఒప్పుకోవాలంటూ మాపై ఒత్తిడి చేస్తుండటం సరికాదు. మా సహనాన్ని పరీక్షించవద్దని ప్రభుత్వానికి సూచిస్తున్నాము. సెప్టెంబర్‌ 11న చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతిస్తారని ఆశిస్తున్నాము. లేకుంటే దానిని వాయిదా వేసుకొంటామే తప్ప ప్రభుత్వం మా డిమాండ్స్‌కు అంగీకరించేవరకు దానిని రద్దు చేసుకోము. మా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటాము,” అని అన్నారు.

ఏపీసీపీఎస్‌యూఎస్ అధ్యక్షుడు సీఎం దాసు మీడియాతో మాట్లాడుతూ, “సీపీఎస్ పై చర్చలకైతే మేము రామని ముందే చెప్పాము. పాత పెన్షన్ విధానం గురించే చర్చిద్దాం రమ్మనమని పిలిస్తే వెళ్ళాము. కానీ మంత్రులు మళ్ళీ జీపీఎస్‌కు ఒప్పుకోవాలంటూ మాపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అందుకే మద్యలో లేచి వచ్చేశాము. మాపై అక్రమకేసులు బనాయించి వేదిస్తుండటంపై మంత్రులకు నిరసనలు తెలిపాము. కానీ వారు స్పందించలేదు. కనుక మాపై అక్రమ కేసులను ఎత్తివేయాలని ఓ వినతి పత్రం సమర్పించి వచ్చాము,” అని అన్నారు.