AP Telangana NITI Aayog Ranks

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 2014, జూన్‌ 2వ తేదీన ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఈ 8 ఏళ్ళలో తెలంగాణ అన్ని  రంగాలలో అభివృద్ధి సాధించి దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన ఒక్కోసారి వాటిని కూడా అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి మాత్రం నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఇందుకు తాజా ఉదాహరణగా నీతి ఆయోగ్ గురువారం ప్రకటించిన ర్యాంకుల గురించి చెప్పుకోవచ్చు.

దేశంలో పెద్ద రాష్ట్రాలను, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను వేర్వేరుగా తీసుకొని ఎనేబులర్స్, పెర్ఫార్మర్స్ పేరుతో రెండు గ్రూపులుగా విభజించి ఇన్నోవేషన్ రంగంలో వాటి పనితీరును లెక్కగట్టి పాయింట్లు ప్రకటించింది.

గత ఏడాది 7వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈసారి 9వ స్థానానికి దిగజారగా గత ఏడాది 4వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి రెండో స్థానానికి చేరుకొంది.

ఎనేబులర్స్ విభాగంలో ఏపీ 8వ స్థానానికి దిగజారిపోగా తెలంగాణ 4వ స్థానానికి ఎగబ్రాకింది. పెర్ఫార్మర్స్ విభాగంలో తెలంగాణ ప్రధమ స్థానంలో నిలువగా ఏపీ 14వ స్థానానికి పడిపోయింది.

ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 18.01 పాయింట్లతో కర్ణాటక అగ్రస్థానంలో నిలువగా తెలంగాణ రాష్ట్రం 17.66 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ సూచీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 13.32 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది.

కేటగిరీ ఆంధ్రప్రదేశ్‌కు లభించిన (పాయింట్లు) తెలంగాణకు

లభించిన

(పాయింట్లు)

ఓవరాల్ 3.32 17.66
హ్యూమన్ క్యాపిటల్ 28.97 26.96
వ్యాపార పరిస్థితులు 37.06 36.54
మానవవనరులు 4.48 6.49
పెట్టుబడి, నైపుణ్యం 4.04 9.17
సేఫ్టీ, లీగల్ ఎన్విరాన్‌మెంట్ 18.74 21.24
నాలెడ్జ్ అవుట్ పుట్ 10.94 19.61
నాలెడ్జ్ డిప్ఫ్యూజన్ 5.03 10.86

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళయినా ఇంతవరకు రాజధాని నిర్మించుకోవాలనే ఇంగిత జ్ఞానం జగన్ ప్రభుత్వానికి లేకపోగా, మళ్ళీ అధికారం చేజిక్కించుకొనేందుకు సంక్షేమ పధకాలను పట్టుకొని వ్రేలాడుతూ రాష్ట్రాభివృద్ధిని విస్మరించినందునే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈవిదంగా అన్ని రంగాలలో వెనుకబడిపోయిందని చెప్పక తప్పదు. రాష్ట్రం వెనకబడిపోవడమే కాదు… ఎడాపెడా అప్పులు చేసేస్తూ రాష్ట్రం మళ్ళీ ఎన్నటికీ కోలుకోలేని దుస్థితికి తీసుకువచ్చి నిలిపింది జగన్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఇంత దుస్థితిలో ఉన్నా, మున్ముందు శ్రీలంకలా దివాళా తీసే ప్రమాదం  కనిపిస్తున్నా ఏపీలో మళ్ళీ వైసీపీయే అధికారంలోకి రావాలని ఎందుకు కోరుకొంటున్నారో సిఎం జగన్మోహన్ రెడ్డికే తెలియాలి.