AP Special Status Special Package Credit Chandrababu, AP Special Status Special Package Credit Pawan Kalyan, AP Special Status Special Package Credit Jaganవిభజన చట్టంలో ఏపీకి దక్కాల్సిన అంశాలపై ఇప్పటివరకు నాన్చుడు ధోరణి వహించిన కేంద్ర ప్రభుత్వం, ఒక్కసారిగా ఉలిక్కిపడినట్లు చకాచకా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఓ ‘ప్రత్యేక ప్యాకేజ్’ను సిద్ధం చేసుకుంది. మీడియా వర్గాల సమాచారం ప్రకారం అయితే… బుధవారం నాడు సాయంత్రం నాటికి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నుండి ఏపీ ప్యాకేజ్ పై ప్రకటన వచ్చే అవకాశం ఉందని స్పష్టమైన కధనాలు ప్రసారం అవుతున్నాయి. ఎంత స్పష్టంగా అంటే…

ఆంధ్రప్రదేశ్ అంతటా ‘స్పెషల్ స్టేటస్’ అంశం ఒక హక్కుగా మారింది. కానీ, సాంకేతికంగా ఆ ‘పదాన్ని’ వినియోగించడం కుదరడం లేదు గానీ, ‘స్పెషల్ స్టేటస్’లో ఉన్న అంశాలనే ఏపీకి అమలు చేస్తామని అరుణ్ జైట్లీ నోట నుండి ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందంట..! పరిశ్రమలు స్థాపించే వారికి పన్ను రాయితీల నుండి ఏపీ అభివృద్ధికి కావాల్సిన సకల సదుపాయాలపై కేంద్రం స్పష్టత ఇవ్వనుందని సమాచారం. అయితే… అసలు ఏమిస్తుందో కేంద్ర మంత్రివర్యులు చెప్పే వరకు వేచిచూద్దాం గానీ… ఏపీ విషయంలో గుర్రుపెట్టి పడుకున్న కేంద్రాన్ని మాత్రం ఏపీ లేపగలిగింది.

మరి ఈ ఘనత… క్రెడిట్… ఎవరికి దక్కుతుంది..? బిజెపితో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతం చేసుకుంటారా? లేక తిరుపతిలో పవన్ ఏర్పాటు చేసిన సభ తర్వాత, పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో, ఆ క్రెడిట్ పవన్ వశం కానుందా? ఇక, చివరగా ఈ రాజకీయ చదరంగంలో అసలు ‘సూత్రదారులం’ మేమే అంటూ ఎప్పుడూ చెప్పుకునే వైసీపీ అధినేత ఈ క్రెడిట్ ను దక్కించుకుంటారా? ఈ ముగ్గురిలో ఎవరికి ఈ అవకాశం దక్కుతుంది? ఇప్పటికే ఈ అంశంపై మీడియా వర్గాలలో కొత్త రచ్చకు కారణమైంది.

అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ లలో… రేసులో నుండి తప్పుకున్నది మాత్రం జగన్ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ‘స్పెషల్ స్టేటస్’ అంశం రాష్ట్ర పరిధిలో లేని అంశమని అందరికీ తెలుసు. అయితే జగన్ ఎక్కుపెట్టిన విమర్శనాస్త్రాలు అన్ని కూడా ఒక్క చంద్రబాబు వైపుకే తప్ప, కేంద్రాన్ని గానీ, ప్రధాని నరేంద్ర మోడీని గానీ పల్లెత్తు మాట కూడా అనకపోవడంతో.., కేంద్రం నుండి ఎలాంటి ప్యాకేజ్ గానీ, ప్రకటన గానీ వచ్చినా… అందులో జగన్ పాత్ర అసలు లేదన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది. దీంతో జగన్ అనే పేరు అసలు బరిలో లేని అంశంగా మారిపోయింది.

మాట్లాడింది ఒక్క బహిరంగ సభ అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వాన్ని చీల్చిచెండాడంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా విజయవంతం అయ్యారు. కేంద్రంపై ఒత్తిడి తేలేదని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీలను విమర్శించారు తప్ప, సందర్భం లేకుండా ఏపీ సర్కార్ ను పల్లెత్తు మాట కూడా అనలేదు పవన్. ఈ అవగాహన వలనే ఈ ప్రకటనలో కొంతమేర పవన్ సొంతం అవుతుందని విశ్లేషకులు విశదీకరిస్తున్నారు. అలాగే ఇటీవల పార్లమెంట్ లో అరుణ్ జైట్లీ ప్రసంగం తర్వాత తీవ్ర ఆగ్రహపూరితుడైన చంద్రబాబు, ఆఖరికి ప్రభుత్వం నుండి బయటకు వచ్చేయడానికి కూడా సిద్ధమయ్యారు.

దీని తర్వాత కేంద్రంలో వచ్చిన కదలికను ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ తారాస్థాయికి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. వీరిద్దరి తీరును గమనించిన కేంద్రం… ‘ఇప్పటివరకు ఉన్న మిత్రులను శత్రువులుగా మార్చుకోలేం’ అంటూ ప్రకటన కూడా చేసారు. అలా మొదలైన ఏపీ ‘ప్రత్యేక హోదా’ను అమలు చేయడానికి సాధ్యం కాకపోయినప్పటికీ, అదే స్థాయి బెనిఫిట్స్ ను రాష్ట్రానికి అందిస్తాము అనే కొత్త నినాదంతో రాబోతుందని సమాచారం. దీంతో ప్రస్తుతం అందరి చూపులు కేంద్రం వైపుకు మళ్ళాయి.