ap-special-category-status-protest-in-vizagగణతంత్ర్య దినోత్సవాలను ఆహ్లాదకరంగా జరుపుకోవాల్సిన రోజున ఉద్రిక్త వాతావరణంలో విశాఖ నగరం ఉంది. దానికి కారణం ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ మరియు ‘వైసీపీ’ అధినేత జగన్ మోహన్ రెడ్డిలే. జల్లికట్టు స్ఫూర్తితో ఏపీకి దక్కాల్సిన ‘స్పెషల్ స్టేటస్’ నిమిత్తం విశాఖ, ఆర్.కే బీచ్ వేదికగా మౌన ప్రదర్శనకు దిగుతామని చెప్పడంతో… విశాఖ అట్టుడుకుతోంది. అసలే రిపబ్లిక్ డే… మరో పక్కన ఇంటిలిజెన్స్ హెచ్చరికలు… ఇంకో పక్కన 24 గంటల్లో ప్రారంభం కాబోయే సీఐఐ సదస్సు..!

దీంతో ఏపీ సర్కార్ ఈ మౌన ప్రదర్శనను అడ్డుకోవడం తప్ప మరొక ప్రత్యామ్నాయం కనిపించకుండా పోయింది. ఉదయం నుండే బీచ్ రోడ్డును మూసివేసి వాకర్స్ కు కూడా అనుమతి నిరాకరించారు. దాదాపుగా మూడు కిలోమీటర్ల మేర ఉన్న బీచ్ రోడ్డు మొత్తం ప్రస్తుతం పోలీసుల స్వాధీనంలో ఉంది. అలాగే నిరసనకారులను, మరికొందరు వైసీపీ నేతలను ముందస్తు చర్యలలో భాగంగా అరెస్ట్ చేసారు. పోలీసు ఆంక్షలతో నగరమంతా ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది.

అలాగే విశాఖ జిల్లా ఉన్న 20కి పైగా పోలీసు స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేసారు. విశాఖలో అయితే సెక్షన్ 30 కూడా అమలు చేయడంతో, ఏ నలుగురు కూడా గూమిగూడి చర్చలు జరపవద్దని పోలీసులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగా కనపడుతున్న విశాఖలో అసలు ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే. ఎందుకంటే… తుఫాన్ ముందు ప్రశాంతత మాదిరి నివురుగప్పిన నిప్పులా నగర పరిస్థితి ఉంది.

ఏ క్షణంలోనైనా ఆందోళనకారులు ఒక్కసారిగా విరుచుకుపడే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాలకు లభించిన కీలక సమాచారం. దీనికి తోడు ‘ఏది ఏమైనా క్యాండిల్ ర్యాలీలో వైసీపీ అధినేత జగన్ తప్పకుండా హాజరు అవుతానని’ చెప్పడం వెనుక… ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేలా తెరవెనుక స్కెచ్ జరుగుతోందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠతో విశాఖ వైపుకు చూస్తున్నారు.