AP Politics YSRCP TDP Janasenaరాష్ట్ర విభజనతో మొదలైన రాజకీయాలు నేటికీ ఏపీలో కొనసాగుతూనే ఉన్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అమరావతి, పోలవరం ప్రాజెక్టు, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలికవసతుల అభివృద్ధి గురించి ఆలోచించకుండా ఎంతసేపు అప్పులు, సంక్షేమ పధకాలు, 175 సీట్లు, ప్రతిపక్షాలపై కక్ష సాధింపుల గురించే ఆలోచిస్తుంటుంది.

ఒకవేళ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లయితే, అప్పుడే ప్రజలే వాటికి బుద్ది చెప్పేవారు. ఉదాహరణకు తెలంగాణ సిఎం కేసీఆర్‌ తన రాష్ట్రాన్ని అన్ని విదాల అభివృద్ధి చేసి చూపుతున్నారు కనుకనే కాంగ్రెస్‌, బిజెపిలు తెలంగాణ ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరధం పడుతున్నారు. గతంలో నరేంద్ర మోడీ కూడా గుజరాత్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపినందునే దేశ ప్రజలు ఆయనకు ప్రధానమంత్రిగా చేశారు. ఇది గ్రహించని సిఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని పక్కనపెట్టి బటన్ నొక్కి సంక్షేమ పాటలు వినిపిస్తూ ప్రజలను మెప్పించాలని చూస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అన్ని విదాల వెనకబడిపోయింది.

అందుకే వైసీపీని గద్దె దించాలని టిడిపి, జనసేనలు వాదిస్తుంటాయి. అదేమీ విశేషం కాదు. కానీ వైసీపీతో అవగాహన ఉన్న బిజెపి కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని వాదిస్తుండటమే విశేషం. ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి అడగగానే ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్, అప్పులు ఇచ్చి భుజం తట్టి ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఏపీలో బిజెపి నేతలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.

ఇదివరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండేవి. రాష్ట్ర బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంటే, కేసీఆర్‌-మోడీ, కేంద్ర మంత్రులతో రాసుకుపూసుకు తిరిగేవారు. కానీ ఇప్పుడు దొడ్డిదారిలోనైనా కేసీఆర్‌ను గద్దె దించుతామని ఆ పార్టీ సీనియర్ నేత కె.లక్ష్మణ్ ప్రకటించారు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలతో ఆ ప్రయత్నం మొదలుపెట్టామని మొన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బహిరంగంగానే ప్రకటించారు.

అంటే నేడు తెలంగాణలో అమలుచేసిన వ్యూహాన్నే రేపు ఏపీలో కూడా బిజెపి అమలుచేయబోతోందని భావించవచ్చు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, మొన్న హైదరాబాద్‌లో రామోజీరావు, జూ.ఎన్టీఆర్‌లతో భేటీ అవ్వడమే ఇందుకు తొలి సంకేతంగా భావించవచ్చు.

మరోపక్క టిడిపి, బిజెపిలు మళ్ళీ దగ్గరవుతున్న సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. వైసీపీ ఎంపీ విజయసాయి కూడా అనుమానం వ్యక్తం చేయడమే ఇందుకు మరో నిదర్శనం. ఇక జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వైసీపీ రహితంగా చేయాలని కోరుకొంటున్నానని, దీనికోసం వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తానని చెపుతూనే ఉన్నారు.

ఇవన్నీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రధానంగా కనిపిస్తున్నవి ఏమిటంటే రాజకీయాలు మాత్రమే. కనుక ఏపీ ఎప్పటికీ ఇలాగే ఓ రాజకీయ ప్రయోగశాలగానే మిగిలిపోతుందా? లేదా ప్రభుత్వం మారిన తరువాతైనా అభివృద్ధి చెందుతుందా?అని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు.