AP Politics 2024 Elections YCP TDP Janasenaగత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజలను పదేపదే వేడుకొన్నారు. ఏపీ ప్రజలు కరిగిపోయి ఆయనకో ఛాన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనకు ఇవే చివరి ఎన్నికలు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండంటూ నిన్న తొలిసారిగా కర్నూలులో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు ఆవిదంగా చెపుతారని బహుశః వైసీపీ నేతలు కూడా ఊహించి ఉండరు. దాంతో వారు అయోమయంలో పడినా వెంటనే తేరుకొని ‘అవును… ఇవే ఆయనకి, టిడిపి కూడా చిట్ట చివరి ఎన్నికలు’ అంటూ ఎదురుదాడి చేయడం ప్రారంభించారు.

ఆనాడు జగనన్న ‘ఒక్క ఛాన్స్…’ అని అడిగితే కాదనకుండా ప్రజలు అధికారం కట్టబెట్టారు కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు ‘లాస్ట్ ఛాన్స్’ ఇమ్మనమని అడిగితే ప్రజలు కాదనకపోవచ్చనే ఆలోచనే వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టించవచ్చు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ అభ్యర్ధనతో ప్రజలలో ఎక్కడ ఆయన పట్ల సానుభూతి కలుగుతుందో అనే ఆందోళన వైసీపీ నేతల్లో అప్పుడే మొదలైందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. “చంద్రబాబు నాయుడు ప్రజలని ఇమ్మోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు,” అని విమర్శించారు.

ప్రజలలో ఇటువంటి ఆలోచన పెరిగి పెద్దదవక మునుపే మొగ్గలోనే తుంచేసేందుకు ఇక నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ‘విరుగుడు మంత్రం’ పటించడం ఖాయం. అది ఫలిస్తుందో లేదో రాబోయే రోజుల్లో క్రమంగా తెలుస్తుంది. ఇక ఈ సెంటిమెంట్ అస్త్రం పనిచేస్తున్నట్లు టిడిపి భావిస్తే తప్పకుండా దీనిని మరింతగా సమర్ధంగా ఉపయోగించుకోవడం ఖాయమే.

గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ‘ఒక్క ఛాన్స్’ ఇమ్మనమని అడిగితే ఈసారి మరో ఛాన్స్ ఇమ్మనమని అడుగుతున్నారు. ఈసారి ఛాన్స్ ఇస్తే మరో 30 ఏళ్ళు సిఎం కుర్చీలో దిగేదేలే అలా సెట్ చేస్తానన్నట్లు చెపుతున్నారు. ఈసారి పవన్‌ కళ్యాణ్‌ తనకీ ‘ఒక్క ఛాన్స్’ ఇవ్వాలని అభ్యర్ధిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు ‘లాస్ట్ ఛాన్స్’ ఇవ్వాలని ప్రజలను అభ్యర్ధిస్తున్నారు. కనుక ఈ ఫస్ట్ ఛాన్స్, మరో ఛాన్స్, లాస్ట్ ఛాన్స్‌లలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు దేనికి మొగ్గు చూపుతారో వచ్చే ఎన్నికలలోపే స్పష్టత రావచ్చు.