జగన్ పై తిరుగుబాటు... ఏమిటా ధైర్యం..!నిన్న మొన్నటి వరకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఒక్క మాట అనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకు మంచి చేసినా, చెడు చేసినా… తనపై ప్రతిపక్షాలు గానీ, ప్రజలు గానీ, అధికారులు గానీ, రాజకీయ విశ్లేషకులు గానీ బహిరంగ విమర్శలు వెల్లువెత్తకుండా చూసుకోవడంలో జగన్ విజయవంతమయ్యారు.

‘మార్గం’ ఏదైనా మొన్నటివరకు విమర్శలు రాకుండా చూసుకున్న ఏపీ ముఖ్యమంత్రి, గడిచిన కొద్దీ రోజులలో మాత్రం సొంత పార్టీ నేతలే బహిరంగంగా విరుచుకుపడుతున్న పరిస్థితి నెలకొంది. మరి ఉన్నట్లుండి ప్రతిపక్షాలకు, ప్రజలకు, ఉండవల్లి లాంటి ప్రముఖులకు, సొంత పార్టీ నేతలకు అంత ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది? అంటే…

Also Read – అయితే చంద్రబాబు ఆలోచన ఫలించిందంటారా… వైసీపిలు?

ఆ ధైర్యం పేరే జగన్ మోహన్ రెడ్డి. అవును… ఈ రెండేళ్ల పాటు జగన్ అవలంభించిన విధివిధానాలే అందరికీ కొండంత ధైర్యాన్ని ఇచ్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ కు అందరూ రెండేళ్ల పాటు సమయం ఇచ్చి వేచిచూసారు.

అందుకే ప్రతిపక్షాలు కూడా పెద్దగా విమర్శలు చేయలేదు. కానీ ఈ రెండేళ్ల కాలం ఏపీని మరో 20 ఏళ్ళు వెనక్కి తీసుకువెళ్లిందన్న ఆర్ధిక గణాంకాలు బయటకు రావడంతో, ఒక్కొక్కరిగా జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకు పడుతున్నారు. ముందుగా సినీ పరిశ్రమ కోసం పవన్ కళ్యాణ్ విమర్శల జోరుకు శ్రీకారం చుట్టారు.

Also Read – పిఠాపురం MLA గారి తాలూకా ఎలివేషన్స్..!

ఆ తదుపరి తెలుగుదేశం పార్టీ నాయకులు చెలరేగుతున్నారు. అప్పుడప్పుడు ఉండవల్లి లాంటి వారు అలా తళుక్కున మెరిసి, సీఎంపై చిచ్చుబుడ్డి లాంటి విమర్శలతో జగన్ ను ఎండ కడుతున్నారు. ఇక ఇటీవల జగన్ తీసుకున్న ‘ఓటీఎస్’ పథకం నిర్ణయం ప్రజలకు కూడా ఊపొచ్చినట్లయ్యింది.

రెండేళ్లుగా సంక్షేమం పేరుతో డబ్బులను పంచి పెడుతోన్న జగన్ పై ప్రశంసల జల్లు కురవలేదు గానీ, ఇప్పుడు ‘ఓటీఎస్’ పథకంతో పేద ప్రజల డబ్బును కాజేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతుంటే, ప్రజలేమో ఇంటికి వచ్చిన అధికారులను నిలదీస్తూ తిరగబడే పరిస్థితి నెలకొంది.

Also Read – టిడిపి మౌనం కూడా వైసీపికి ఆందోళన కలిగిస్తోందా?

“ఒక్క రూపాయి కూడా కట్టేది లేదు, కావాలంటే నోటీసులు ఇవ్వండి, సంతకం చేసి నాకు పేపర్లు ఇవ్వండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మా ఇళ్లకు వచ్చి మీరు కొలతలు వేసేదేంటి” అనేటంత ధైర్యం ప్రజలకు కల్పించిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే చెల్లుతుంది.

ఇప్పటివరకు ఎవరైతే తనకు అండదండలు అని జగన్ అనుకున్నారో, నేడు అదే మహిళలు, పేదలు ‘ఓటీఎస్’ పధకం కలెక్షన్స్ కోసం వచ్చిన వాలెంటైర్స్, అధికారులపై తిరగబడుతున్న వైనానికి అనేక వీడియోలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సోషల్ మీడియా ఇందుకు వేదిక అవుతోంది.

ప్రజల నుండి వ్యక్తమవుతోన్న ఈ వ్యతిరేకతతో సొంత పార్టీ నేతలు కూడా సీఎం జగన్ విధానాలను ఏకిపారేస్తున్నారు. నిన్నటివరకు ‘జై’ కొట్టిన నోరులే, నేడు ఎండకడుతున్న తీరును చూస్తే… రెండున్నర్రేళ్ళ పాలనలో ఎంత మార్పు వచ్చిందో ప్రస్ఫుటమవుతోంది. “ఒక్క ఛాన్స్” ఎంతమంది జీవితాలను ప్రభావితం చేసిందో!?