ap ngo chandrashekar reddyనిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నగారా మోగించారు. నాలుగు దఫాలుగా ఎన్నికలు వచ్చే నెలలో జరుగనున్నాయి. నిమ్మగడ్డ చంద్రబాబు మనిషి, చంద్రబాబు కులం వాడు అంటూ ఆరోపిస్తూ ఆయన సారథ్యంలో ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు అధికారపక్షం. కరోనా వంకతో అడ్డుకోవాలని చేస్తుంది.

అందుకోసం ఇప్పటికే కోర్టుని ఆశ్రయించింది. అయితే బీ ప్లాన్ కూడా ఇందుకు రెడీ చేసుకుంది. ఎన్నికల కమిషన్‌ మొండిగా వ్యవహరించి ముందుకెళ్తే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తో చెప్పిస్తున్నారు. తమకు ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమని, ఎన్నికల షెడ్యూల్‌ను సత్వరం ఉపసంహరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఎన్నికల వాయిదా కోసం అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇవే సంఘాలు… మొన్న ఆ మధ్య మాకు ఒక రోజు సెలవు ఇస్తే వెళ్లి జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఓటు వేసి వస్తాం అని ప్రభుత్వాన్ని కోరాయి. ఇవే సంఘాలకు తిరుపతి ఉపఎన్నిక పై ఎటువంటి అభ్యంతరం లేదు.

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సమయానికి జీతాలు ఇవ్వకపోయినా… రెండు డీయేలు ఇవ్వకపోయినా ఉలుకుపలుకు లేకుండా ఉండిపోయాయి. ఈ విషయమే సదరు రెడ్డి గారి దగ్గర మీడియా ప్రస్తావిస్తే… “కరోనా కారణంగా ప్రభుత్వం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రాయితీలను భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి తప్పకుండా సాధించుకుంటాం,” అంటూ ఉదారంగా ప్రకటించారు.

“ఉద్యోగ సంఘాలను ఈ ప్రభుత్వం కుల సంఘాలుగా మార్చేసింది. తమకు అనుకూలంగా ఉండే సొంత కులం వారిని నియమించి వారిని తమ అనుకూల ఎజెండాకు వాడుకుంటుంది. ఉద్యోగుల హక్కులను గాలికి వదిలేసి ప్రభువుల సేవలో మునిగితేలుతున్నారు. దేశం మొత్తం ఎన్నికలు జరుగుతుంటే… వాటిని అడ్డుకుని ఇక్కడ ఉద్యోగులను పల్చన చేస్తారు,” అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.