KCR BRS Partyఆంధ్రప్రదేశ్‌ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ సాధించుకొన్న కేసీఆర్‌ తన జాతీయ రాజకీయాలను ఏపీలోనే మొదలుపెట్టడం విశేషం. ముందే చెప్పుకొన్నట్లు ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌ని ఏపీ బిఆర్ఎస్‌ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి చింతల పార్ధసారధి, టీజే ప్రకాష్, కాపునాదు జాతీయ అధ్యక్షుడు తాడివాడ రమేష్ నాయుడు, కాపునాడు ప్రదాన కార్యదర్శి గిద్దల శ్రీనివాస నాయుడు, ఏపీ ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షుడు రామారావు వారి అనుచరులు సోమవారం సాయంత్రం భారీ ఊరేగింపుగా హైదరాబాద్‌, తెలంగాణ భవన్‌ చేరుకొని సిఎం కేసీఆర్‌ సమక్షంలో బిఆర్ఎస్‌ పార్టీలో చేరారు.

త్వరలోనే ఏపీలో ఎమ్మెల్యేలతో సహా పలువురు సీనియర్ రాజకీయ నాయకులు బిఆర్ఎస్‌ పార్టీలో చేరబోతున్నారని కేసీఆర్‌ చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత దేశవ్యాప్తంగా 4,183 శాసనసభ, 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, అలాగే సుమారు ఆరున్నర లక్షల గ్రామాలలో బిఆర్ఎస్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేసి, బిఆర్ఎస్‌ కేంద్రంలో అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తున్న ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకొంటామని, తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు, సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి పనులను దేశమంతా అమలుచేస్తామని కేసీఆర్‌ చెప్పారు. తాను పదవులు, అధికారం కోసం అర్రులు చాచడం లేదని ఓ భారతీయుడిగా దేశాన్ని చక్కదిద్దుకోవాలనే ఆలోచనతోనే బిఆర్ఎస్‌ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తున్నానని కేసీఆర్‌ చెప్పారు.

కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన మాట వాస్తవమే. అయితే తెలంగాణలో ప్రతిపక్షాలన్నిటినీ ఉక్కుపాదంతో నలిపివేస్తూ, తన మాటే శాసనం అన్నట్లు పాలన చేస్తున్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలు కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నాయి. అవి రాజకీయ దురుదేశ్యంతో చేస్తున్న ఆరోపణలని అనుకొన్నా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరుని ఈడీ ఛార్జ్ షీట్‌లో చేర్చింది. కేసీఆర్‌ మంత్రివర్గంలో మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌ ఇంకా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి.

అందుకే కేసీఆర్‌ తెలంగాణని ఎంతగా అభివృద్ధి చేసినప్పటికీ ప్రజలలో వ్యతిరేకత పెరుగుతోంది. అందుకే ఆ రాష్ట్రంలో బిజెపి బలపడగలుగుతోంది. ఇంట్లో ఈగల మోత… బయట పల్లకీ మోత అన్నట్లు తెలంగాణలోనే వ్యతిరేకత ఎదుర్కొంటూ కేసీఆర్‌ దేశాన్ని ఉద్దరిస్తానని బయలుదేరుతుండటం, ఆయనకి ఏపీలో రాజకీయ నిరుద్యోగులు జేజేలు పలుకుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

AP leaders joined in kcr brs party at telangana bhavan