JAC chairman Bopparaju Venkateswarluఇల్లలకాగానే పండుగ కాదన్నట్లు వైసీపీ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేసి విశాఖలో రెండు రోజులపాటు అట్టహాసంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ నిర్వహించి ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.13.56 లక్షల కోట్లు పెట్టుబడులు, 6 లక్షల మందికి ఉద్యోగాలు సాధించామని గొప్పలు చెప్పుకొంటోంది. కానీ ప్రభుత్వోద్యోగులే దాని గాలి తీసేశారు.

ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సహచర నేతలతో కలిసి ఈరోజు విశాఖలోనే మీడియా సమావేశం నిర్వహించి జగన్ ప్రభుత్వాన్ని కడిగిపడేశారు. “వైసీపీ అధికారంలోకి వస్తే వారం రోజులలోగా సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నాలుగేళ్ళు కావస్తున్నా ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదు?వివిద రాష్ట్రాలలో ఈ హామీ ఇవ్వని పార్టీలు కూడా అధికారంలోకి రాగానే సిపిఎస్ రద్దు చేసినప్పుడు, వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చినా ఎందుకు రద్దు చేయడం లేదు?

ఎన్నికలకు ముందు మీరే సిపిఎస్ విధానం వలన మాకు నష్టం జరుగుతోందని, దీనిని తప్పక రద్దు చేయాల్సిందే అని హూంకరించారు. కానీ దానినే రద్దు చేయడానికి ఇప్పుడు ఎందుకు వెనకాడుతున్నారు? ప్రభుత్వం ప్రతిపాదించిన జీపిఎస్ విధానం మాకు ఆమోదయోగ్యం కాదని స్పష్టంగా మేము చెపుతున్నప్పటికీ దానికే మేము అంగీకరించాలని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు?

సీపీఎఫ్ ఖాతాలలో మేము దాచుకొన్న రూ.12,000 కోట్లు, జీపీఎఫ్ ఖాతాలోని రూ.3,000 కోట్లు ఏమయ్యాయి? వాటిని దేనికి వాడుకొన్నారు? వాటిని మా ఖాతాలలో తిరిగి ఎప్పుడు జమా చేస్తారు? అయినా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు దాచుకొన్న సొమ్ముని ఏ అధికారంతో తీసుకొన్నారు?” అని ప్రశ్నించారు.

ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల 11వ పీఆర్సీ బకాయిల గురించి ప్రశ్నిస్తూ, “మా బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోంది? ఇంకా ఎప్పుడు చెల్లిస్తారు?డీఏ బకాయిలు ఇచ్చిన్నట్లే ఇచ్చి వెనక్కు తీసుకోవడాన్ని ఏమనుకోవాలి? ఇప్పటి వరకు మూడు డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఆ ఊసే లేదు. జీతాల కోసం పోరాటాలతోనే సరిపోతోంది మాకు. ఉద్యోగంలో ఉన్నవారికే డీఏ తదితర బకాయిలను చెల్లించనప్పుడు పదవీ విరమణ చేసినవారి పరిస్థితి ఏమిటి? రేయనక, పగలనక పనిచేసే పోలీసులకు సరేందర్ లీవుల బకాయిలు ఏడాదిగా ఎందుకు చెల్లిండం లేదు?ఇంకా ఎప్పుడు ఇస్తారు?” అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని నిలదీశారు.

బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ “ప్రభుత్వం మాకు సకాలంలో జీతాలు, వేతన సవరణల బకాయిలు ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది. పదవీ విరమణ చేసిన వారికి పింఛన్లు, బకాయిలు ఇవ్వలేకపోతోంది. కానీ మీ రాజకీయ నాయకులు మాత్రం ఒక్కసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు… జీవితాంతం పెన్షన్ తీసుకొంటారా?దానిని మీరు వదులుకోగలరా?ముప్పై ఏళ్ళుపైగా పనిచేస్తే మాకు జీతాలు ఇవ్వలేరు… బకాయిలు ఇవ్వలేరు… మాకు పెన్షన్లు ఇవ్వలేదు. తిరిగి మేము దాచుకొన్న డబ్బునే ప్రభుత్వం వాడేసుకొంటుంది.

మాతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగులు నానా కష్టాలు పడుతున్నారు. ఇంకా ఎంతకాలం ఈ అన్యాయం సహించాలి?మంత్రుల కమిటీతో ‘ఛాయ్-బిస్కట్ చర్చలు’తో మాకు న్యాయం జరగడాని స్పష్టమైంది. అందుకే మార్చి 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా ఉద్యమాలు చేపట్టబోతున్నాము. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మా సమస్యలు, డిమాండ్స్ పై స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని ప్రభుత్వాన్ని ఘాటుగా హెచ్చరించారు. మార్చి 9 నుంచి మొదలయ్యే ఆందోళనలలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.