AP_JAC_Bopparaju_Venkateswarlu_Employees_Salariesమంగళవారం వెలగపూడిలో సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గం ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహార్ రెడ్డి తదితరులు సమావేశమై చాలాసేపు చర్చించారు.

అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఉద్యోగులందరూ మా కుటుంబ సభ్యులే. అందరం కలిసి కట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, ఇన్ని సంక్షేమ పధకాలు అమలుచేయగలుగుతున్నాము. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధికస్థితి దెబ్బతినడంతో ఉద్యోగులకు బకాయిలు చెల్లించడంలో ఆలస్యమైంది. మార్చి నెలాఖరులోగా రూ.3,000 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే జీపీఎఫ్ పెండింగ్ బిల్లులను, రిటైర్మెంట్ గ్రాట్యూటీ, సరెండర్ సెలవుల బకాయిలు అన్నిటినీ ఈ నెలాఖరులోగా ప్రభుత్వం బేషరతుగా చెల్లిస్తుంది. మిగిలిన అంశాలను కూడా పరిష్కరించేవరకు ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు కొనసాగిస్తాము,” అని చెప్పారు.

ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస్ విలేఖరులతో మాట్లాడుతూ, “మొత్తం రూ.16,000 కోట్ల బిల్లులు పెండింగులో ఉంటే రూ.3,000 కోట్ల డీఏ బకాయిలను రెండు క్వార్టర్లలో చెల్లించేందుకు అంగీకరించారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు జారీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశాలపై ఇంకా చర్చిచాల్సి ఉంది. ఈసారైనా ప్రభుత్వం మా బకాయిలను చెల్లిస్తుందని ఆశిస్తున్నాము లేకుంటే కార్యాచరణ ప్రకారం ముందుకు సాగుతాము,” అని అన్నారు.

బొప్పరాజు వెంకటేశ్వర్లు విలేఖరులతో మాట్లాడుతూ, “పెండింగ్ బిల్లులు చెల్లింపుపై హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీపీఎస్ రద్దు గురించి చాలా లోతుగా చర్చించాము. కానీ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. త్వరలోనే మా కార్యవర్గంతో సమావేశమై ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకొంటాము,” అని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం తీరుతో సహనం నశించడంతో ఏపీ ప్రభుత్వోద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సమ్మెకు కార్యాచరణ ప్రకటించినందునే ప్రభుత్వం మేల్కొని రూ.3,000 కోట్లు చెల్లించేందుకు సిద్దపడిందని అర్దమవుతూనే ఉంది. కానీ ఇంకా మరో రూ.13,000 కోట్ల బకాయిలు ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలే చెపుతున్నారు. మరి వాటిని ఇకా ఎప్పుడు చెల్లిస్తుందో, సిపిఎస్‌ని రద్దు చేస్తుందో లేదో?వారికే తెలియాలి. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు కనుక ఆ చొరవతోనే వారి సొమ్మును తీసి వాడేసుకొందని సరిపెట్టుకోవాలేమో?