MLA Madhusudhan Reddy - MLA Roja - MLA Rajini Vidadalaకరోనా వ్యాప్తికి వైసీపీ నేతలే కారణమంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో వైసీపీ నేతలు నిబంధనలు అతిక్రమించారని వేసిన పిటిషన్‌పై మంగళవారం హై కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది. ఈ నేపథ్యంలో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, నెల్లూరు జిల్లా కిలివేటి సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినికి ఈ నోటీసులు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీ, ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

అయితే ఈ వ్యవహారంపై స్పందించిన సదరు ఎమ్మెల్యేలు మీడియా ముందు సెంటిమెంట్ పండిస్తున్నారు. “మేము ఎలాంటి తప్పు చెయ్యలేదు. ఇటువంటి కష్టకాలంలో ప్రజలకు సాయపడటానికి మా ప్రాణాలకు తెగించి నిత్యావసర సరుకులు పంచుతున్నాం. అది ఓర్వలేక ప్రతిపక్షాలు మా మీద కుట్ర పన్నుతున్నాయి,” అంటూ చెప్పుకొస్తున్నారు.

ఇటువంటి మాటలు అమాయకులైన కొందరు ప్రజలు నమ్మవచ్చు… అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా చూసీ చూడనట్టు ఊరుకోవచ్చు. అయితే కోర్టులు ఎలా చూస్తూ ఊరుకుంటాయి. సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ కోర్టులకు పూస్తే అసలుకే మోసం జరగొచ్చు. ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటలలో 60 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసులు 1,777కు చేరాయి.