Jagan -AP- High Courtఉపాధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1134 కోట్లను ఎందుకు పంపిణీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర నిధులను ఇతర సంక్షేమ కార్యక్రమాలకు మళ్లించారని ఆరోపిస్తూ టీడీపీ కోర్టుకి వెళ్ళింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది మాత్రం అటువంటిది ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేసారు. ఇది ఇలా ఉండగా… 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఉపాధి పనుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కేంద్రం ఇచ్చిన రూ.1845 కోట్లను రాష్ట్రం ఇతర అవసరాల కోసం మళ్లించిందంటూ గతంలో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

ఈ పిటిషన్‌పై కేంద్రం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ వేయకుంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇది అలా ఉండగా, ఈ కేసులో కౌంటర్ దాఖలు చెయ్యకుండా కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి పరోక్షంగా సహకరిస్తోందా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తూ పోతుంది. దీని కోసం నిధులను మళ్లించడం చేస్తుంది. చట్ట ప్రకారం కొన్ని పనులకు మాత్రమే వినియోగించాల్సిన నిధులను కూడా సంక్షేమ పథకాలకు మళ్లించడం విమర్శలకు దారి తీస్తుంది. దీనిపై కోర్టులు ఎలా స్పందిస్తాయో చూడాలి.