High Courtసాధారణంగా పాఠశాలలో పిల్లల హోమ్‌వర్క్ చేయనప్పుడో క్లాసులో అల్లరి చేసినందుకో టీచర్లు వారిని తరగతి గాడి బయట నిలబెట్టిస్తుంటారు. కానీ ఈరోజు ఇద్దరు ఏపీ ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులకి హైకోర్టు సరిగ్గా అదే శిక్ష విధించింది. ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఐజీగా ఉన్న రామకృష్ణ అనే ఐఆర్ఎస్ అధికారిని, బుడితి రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినందుకు ఇద్దరికీ నెలరోజులు జైలు శిక్ష, చెరో రూ.2,000 చొప్పున జరిమానా విధించింది. ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఈ విషయం తెలుసుకొన్న ఇద్దరు అధికారులు ఈరోజు ఉదయం హైకోర్టుకి వచ్చి న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పుకొని జైలు శిక్షని రద్దు చేయవలసిందిగా అభ్యర్ధించారు. దాంతో న్యాయమూర్తి వారి జైలు శిక్ష రద్దు చేశారు కానీ ఈరోజు సాయంత్రం కోర్టు పనివేళలు ముగిసేవరకు కోర్టులోనే నిలబడి ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతం వారిద్దరూ హైకోర్టులో నిలబడి ఉన్నారు!

ఇదివరకు ప్రభుత్వంలో పనిచేసిన్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు ప్రభుత్వ నిర్ణయాలు చట్టవిరుద్దంగా లేదా రాజ్యాంగవిరుద్దంగా ఉన్నాయని భావిస్తే వాటిని నిర్ద్వందంగా తిరస్కరించేవారు. అప్పుడు ప్రభుత్వమే వాటిని సవరించుకొనేది లేదా ఉపసంహరించుకొనేది. కానీ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు ప్రభుత్వ నిర్ణయాలు తప్పని తెలిసి ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిళ్ళు లేదా పదోన్నతుల కోసం లేదా మరొకందుకో యదాతదంగా అమలుచేస్తున్నారు. కానీ నేటికీ న్యాయస్థానాలు రాజ్యాంగం, చట్టాలని అమలయ్యేలా చేస్తున్నందున, అందుకు విరుద్దంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు హైకోర్టులో మొట్టికాయలు వేయించుకోవలసి వస్తోంది లేదా ఇలాంటి అవమానకర పరిస్థితులని ఎదుర్కోవలసివస్తోంది. కనుక ధైర్యంగా రాజ్యాంగబద్దంగా విధులు నిర్వహించడం నేర్చుకోవాలి లేకుంటే ఇటువంటి శిక్షలు, అవమానాలకు సిద్దపడాల్సిందే!