AP High Court asks AP DGP to attend the court-పోయిన నెల 17న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు నిలువరించడంతో పోలీసుల వైఖరిపై ఆక్షేపణలు వస్తున్నాయి. దీనిపై టీడీపీ హై కోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ కేసు ఈ రోజు రెండవ హియరింగ్ కు వచ్చింది. డీజీపీ, విశాఖ పోలీసులు వేసిన అఫిడవిట్ మీద కోర్టు ఆగ్రహం చెందింది.

దీనితో ఈ నెల 12కు పిటిషన్ విచారణ వాయిదా వేసిన హైకోర్టు. ఈ నెల 12న కోర్టుకు హాజరుకావాలని డీజీపీకి ఆదేశించింది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత డీజీపీని హై కోర్టు తమ ముందు హాజరు కామని చెప్పడం ఇది రెండో సారి. సహజంగా ఇటువంటి ఆదేశాలు డీజీపీ స్థాయి వ్యక్తులు చాలా నామోషీగా తీసుకుంటారు.

అలాగే ఎయిర్‌పోర్ట్ దగ్గరకు వచ్చిన వారిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని కోర్టు పోలీసుల్ని ప్రశ్నించింది. మరో వైపు కోర్టు తీర్పు అనుకూలంగా రాగానే అదే వారంలోనే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఉండవచ్చని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మునుపటి పర్యటన కంటే భారీ ఏర్పాట్లకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి.

అయితే 2017లో ఒకసారి జగన్ ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఇదే విధంగా ఎయిర్ పోర్టులోనే అడ్డుకుందని, చంద్రబాబుకి సరిగా అదే చెయ్యడంతో తమ పంథం నెగ్గిందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బాహాటంగానే చెబుతున్నారు. అయితే రాజకీయ వ్యూహప్రతి వ్యూహాలతో పోలీసులు నలిగిపోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.