Ap govt to remove outsourcing staff in various departmentsతమ పార్టీ అధికారంలోకి వస్తే కొత్తగా ఉద్యోగాలు కల్పించడమే తప్ప ఉన్నవారిలో ఏ ఒక్కరినీ తొలగించబోమని, అవుట్ సోర్సింగ్‌ సిబ్బందికి కూడా ప్రభుత్వోద్యోగులతో ‘సమాన పనికి సమాన జీతం’ ఇస్తామని ఆనాడు జగనన్న చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో అనేకమందిని అవుట్ సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగాలలోకి కూడా తీసుకోవడంతో తమ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతుందని నమ్మేవారు. కానీ మూడున్నరేళ్ళయినా ఇంతవరకు ఏ ఒక్కరినీ క్రమబద్దీకరించలేదు. కానీ గుట్టు చప్పుడు కాకుండా ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. పదేళ్ళలోపు సర్వీసు ఉన్నవారినందరినీ తక్షణం ఉద్యోగాలలో నుంచి తొలగించాలని జీవోలో పేర్కొంది. పదేళ్ళలోపు పనిచేసినవారందరినీ తక్షణం ఉద్యోగాలలో నుంచి తొలగించాలని ఆ జీవోలో పేర్కొంది. అవుట్ సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న డీఈవోలు, టైపిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, జూనియర్ అసి స్టెంట్స్, అటెండర్స్, టీచర్స్ వగైరా సిబ్బంది సర్వీసులను తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశం మేరకు వివిద శాఖలలో కనీసం 3 నుంచి 10 ఏళ్ళలోపు సర్వీసు గల అవుట్ సోర్సింగ్‌ సిబ్బందిని గుర్తించి తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇంతకాలం తమ ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని అవుట్ సోర్సింగ్‌ సిబ్బంది ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ హటాత్తుగా రేపటి నుంచి ఉద్యోగాలకి రానక్కరలేదని అధికారులు చెపుతుండటంతో అవుట్ సోర్సింగ్‌ సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో సుమారు 2.40 లక్షల మందికి పైగా అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగులున్నారు.

అతి తక్కువ జీతాలకి గొడ్డుచాకిరీ చేస్తున్న తమకి జీతాలు పెంచి, పర్మనెంట్ చేస్తారని ఎదురుచూస్తుంటే, హటాత్తుగా ఉద్యోగాలలో నుంచి తొలగిస్తే ఎలా బ్రతకాలి?అని అవుట్ సోర్సింగ్‌ టీచర్స్ అండ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్‌ ఏవి. నాగేశ్వర రావు ప్రశ్నించారు. ఆనాడు జగనన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయకపోగా, ఉన్న ఉద్యోగులను తొలగించాలనుకోవడం సరికాదని అన్నారు. కనుక వైసీపీ ప్రభుత్వం తక్షణం ఆ జీవోని ఉపసంహరించుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ప్రత్యేకహోదా రాకపోతే పరిశ్రమలు రావని, భావితరాలు నష్టపోతాయని జగన్మోహన్ రెడ్డి ఇదివరకు దీక్షలు, ఆందోళనలు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు! మూడు రాజధానులొస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగాలు వస్తాయని ఇప్పుడు వితండవాదం చేస్తున్నారు. కానీ మూడున్నరేళ్ళలో మూడు రాజధానులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. పైగా రాష్ట్రంలో పరిశ్రమలను తరిమేస్తున్నారు. అలా పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోయిన కంపెనీలలో అమర్ రాజా బ్యాటరీస్ కూడా ఒకటి. అది తెలంగాణలో రూ.9,500 కోట్లు పెట్టుబడితో భారీ పరిశ్రమను ఏర్పాటుచేయబోతోంది.

ప్రత్యేకహోదా అటకెక్కిపోయింది… మూడు రాజధానులు రాజకీయాలకే ఉపయోగపడుతున్నాయి. పరిశ్రమలు తరలిపోతున్నాయి. ఇప్పుడు అవుట్ సోర్సింగ్‌ ఉద్యోగాలకు కూడా ‘జగనన్న వేటు’ పధకం అమలవుతోంది. ఒక్క ఛాన్స్ ఇచ్చి శఠగోపం పెట్టించుకొన్నట్లుంది కదా?