I Love -Vizag-కేంద్ర ప్రభుత్వం నిన్న దేశవ్యాప్తంగా ఉన్న హాట్ స్పాట్స్ వివరాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తప్ప మిగతా పదకొండు జిల్లాలను హాట్ స్పాట్స్ గా ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం పై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. జిల్లాలో ఇప్పటివరకూ 20 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి.

గత ఎనిమిది రోజులుగా కేసులు నమోదు కాలేదు. కరోనా కేసులు బయటపడ్డ మొదట్లో ఎక్కువగా విశాఖలోనే కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. ఆ తరువాత ఆగిపోయాయి. టీడీపీ వారు.. ప్రభుత్వం కావాలనే విశాఖ లో కేసులు తొక్కిపెట్టి, అదే సమయంలో అమరావతి ఉన్న గుంటూరు లో కేసులను ఎక్కువగా చూపించి రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం విడుదల చేస్తున్న మెడికల్ బులెటిన్లలో తప్పులు తరచు దొర్లడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. విశాఖపట్నం వంటి సిటీ ప్లస్ అంతర్జాతీయ సర్వీసులు కలిగిన ఎయిర్ పోర్టు ఉన్నా కేసులు ఎక్కువ లేకపోవడం ఆశ్చర్యమే అని నిపుణులు కూడా అంటున్నారు.

కట్టుదిట్టమైన చర్యలతో విశాఖలో కేసులను కట్టడి చేశామని అధికారులు అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వ వాదనే నిజమైతే అంతకంటే కావాల్సింది ఏముంది? ఇది ఇలా ఉండగా… 28 రోజుల పాటు ఒక జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకపోతే ఆ జిల్లాను హాట్ స్పాట్స్ జాబితా నుండి తొలగించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కేసులు 600కు దగ్గరలో ఉన్నాయి. గుంటూరు జిల్లా 150 కేసులు దగ్గరలో ఉన్నాయి. కర్నూల్ జిల్లాలో కూడా వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి.