ap govt going to held intermediate exams from mayఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఆ రోజుకు ఆరోజు పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటికే రోజుకు పదిహేను వేలకు కేసులకు పైగా నమోదు అవుతున్నాయి. అయినా టెన్త్, ఇంటర్ పరీక్షల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టువీడటం లేదు. కాసేపటి క్రితం విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా ముందుకు వచ్చి మే 5 నుండి ఇంటర్ పరీక్షలు జరుగుతాయని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

మే 5 నుంచి 19 వరకు ఇంటర్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,452 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాలో 80 నుంచి 90 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయలేదని… ఏపీ లో కూడా జరిపి తీరతామని మంత్రి చెప్పుకొచ్చారు.

మరోవైపు… పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌‌ను స్వీకరించిన ధర్మాసనం, రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు లేదా వాయిదా వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అధికార పక్షానికి రాజకీయం చేసే అవకాశం లేకుండా విద్యార్థులు, తల్లిదండ్రుల తరుపున ఈ రిట్ పిటిషన్ దాఖలైంది.

ఈ కేసులో న్యాయ నిపుణులు ప్రభుత్వానికి చుక్కెదురు తప్పదని అంటున్నారు. “పరీక్షలు నిర్వహించే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో లేవు. ప్రభుత్వం మొండితనానికి పోతే విద్యార్థులు, టీచర్లు, విద్యార్థుల తల్లితండ్రుల ప్రాణాలను రిస్క్ లో పెట్టినట్టే. మొట్టికాయలు వేయించుకునేంత వరకు మొండి పట్టు వదలరు,” అని వారు అంటున్నారు.