AP Govt Employees Rally vijayawadaవిజయవాడ దద్దిరిల్లిపోయింది. ఒక ప్రధాన రహదారి అంతా చీమల మాదిరి గుమిగూడిపోయి ఉన్న వీడియో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో సందడి చేస్తోంది. నిజానికి ఇంత మంది పాల్గొంటారన్న విషయం ప్రభుత్వం వద్ద కూడా సమాచారం లేకపోవడంతో, పోలీస్ వ్యవస్థ చేతులెత్తేసింది.

నేడు జరిగిన ఉద్యమంలో ఉద్యోగులు ప్రభుత్వంపై తమకున్న ఆగ్రహాన్ని భారీ స్థాయిలో ప్రదర్శించారు. ముఖ్యంగా ఉద్యోగులపై నిరంతరం ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ చర్చలకు ఆహ్వానిస్తున్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఓ స్థాయిలో ట్రోల్ చేసారు.

మీడియా వర్గాలు నేరుగా రాయలేని భాషలో సజ్జలను కీర్తించారంటే, వారి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అవగతం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కాదు అసలు సినిమా మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతుందన్న సంకేతాలను ఉద్యోగులు స్పష్టంగా వెల్లడించారు.

ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా తలొగ్గేది లేదని చెప్పిన ఉద్యోగులు, 6వ తేదీ అర్ధరాత్రి నుండి సమ్మెలో పాల్గొనబోతున్నట్లుగా స్పష్టత ఇచ్చారు. మరి జగన్ సర్కార్ చేతిలో ఉన్న మూడు కీలక రోజులను ఏ విధంగా వినియోగించుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

యధావిధిగా ఉద్యోగులపై ఎదురుదాడిని ప్రదర్శిస్తారా? లేక నేడు ఉద్యోగులలో చూసిన ఫైర్ కు తలొగ్గి, కొత్త పీఆర్సీ జీవోను వెనక్కి తీసుకుంటారా? ప్రభుత్వం మదిలో మెదులుతోన్న ఆలోచనలు ఏమిటి? ఇలా అనేకానేక అంశాలు ప్రస్తుతం మీడియా వేదికలుగా చర్చలు జరుగుతున్నాయి.

‘ఛలో విజయవాడ’ కార్యక్రమంతో తాము ‘ఫ్లవర్స్ కాదు, ఫైర్’ అన్న విషయాన్ని ప్రభుత్వానికి తెలిసేలా చేయడంలో ఉద్యోగులు నూటికి నూరు శాతం విజయవంతం అయ్యారు. అయితే ఇదే విధానంలో ప్రభుత్వం కూడా ఆలోచనలు చేస్తేనే అసలు ఇబ్బందులు ఉత్పన్నం అయ్యేది.

ఇప్పటికే అనుభవ రాహిత్యంతో అనేక సమస్యలను జఠిలతరం చేసారన్న ఆరోపణలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల అంశం కూడా ఇలాగే మారింది. ఒకవేళ సమ్మె సైరన్ మ్రోగితే కనుక, ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఇబ్బందులు తప్పవన్నది విశ్లేషకుల అంచనా.