నంది అవార్డ్స్ – విమర్శలు తక్కువ, ప్రతిభకే పట్టం! ప్రతి ఏడాది తెలుగు సినీ పరిశ్రమలోని ఉత్తమ ప్రతిభలకు నంది పురస్కారాలు అందించి, ప్రోత్సహించడం అనేది 1964 నుండి ప్రభుత్వ పరంగా జరుగుతూ వస్తోంది. కానీ, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్ ప్రభావంతో నెలకొన్న అనిశ్చితి పుణ్యమా అంటూ తెలుగు సినీ వర్గీయులకు నంది అవార్డులు దూరమయ్యాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో, ఇంకా నంది అవార్డుల చరిత్ర ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ఈ తరుణంలో, గతేడాది ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

తాజాగా సదరు కమిటీ 2012, 2013 సంవత్సరాలకు గానూ నంది అవార్డులను ప్రకటించింది. అయితే నంది అవార్డులను ప్రకటించిన ప్రతిసారీ ఏదొక విమర్శలు తలెత్తడం సహజమే కాగా, ఈ సారి అందుకు విరుద్ధంగా నంది పురస్కారాలను ఎంపిక చేసినట్లుగా కనపడుతోంది. ముఖ్యంగా చిన్న సినిమాలను, కొత్తదనంతో కూడిన కధాబలం ఉన్న సినిమాలకు పట్టం కట్టినట్లుగా ఎంపిక చేసిన అవార్డులే చెప్తున్నాయి. అలాగే మూసధోరణిలో తీసి, కమర్షియల్ గా ఎంత విజయవంతం సాధించినా, వాటిని పక్కన పెట్టడం ప్రశంసలను అందుకుంటోంది.

2012లో విడుదలై అద్భుతమైన అభినయం ఆకట్టుకున్న “ఎటో వెళ్ళిపోయింది మనసు” జంట నాని, సమంతలకు ఉత్తమ నటీనటులుగా ఎంపిక చేయడం ఆహ్వనించదగ్గ పరిణామం. దీంతో సహజ నటుడు నాని ఖాతాలో మొదటి నంది పడింది. ఇటీవల వరుస సక్సెస్ లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన నానికి కాలం మామూలుగా కలిసి రావడం లేదనడానికి, నడిచి వచ్చిన ఈ నంది పురస్కారమే సాక్ష్యం. అలాగే ఉత్తమ చిత్రంగా ఈగ, దర్శకుడుగా రాజమౌళి, విలన్ గా సుదీప్, ఉత్తమ సంగీత దర్శకులుగా ఇళయరాజా, కీరవాణిలను ఎంపిక చేసారు.

2013కు గానూ ఉత్తమ చిత్రంగా ‘మిర్చి,’ ఉత్తమ హీరోగా ప్రభాస్, హీరోయిన్ గా అంజలి (నా బంగారు తల్లి), ఉత్తమ దర్శకుడు దయా కొడవగంటిలకు లభించింది. పెద్ద చిత్రాలలో ‘మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలకు తప్ప మరే చిత్రాలకు ఆశించిన అవార్డులు రాకపోవడంతో, అవార్డుల కమిటీ ఎంత నిస్పక్షపాతంగా ఎంపిక చేసిందో అర్ధమవుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన “అత్తరితింటికి దారేది” సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులు సృష్టించినా, ఉత్తమ మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడుగా దేవిశ్రీప్రసాద్, ప్రజాధరణ పొందిన చిత్రంగా మాత్రమే ఎంపిక అయ్యింది.