“ఇందుగలడని అందులేడని సందేహంబు వలదు; ఎందెందు వెతికినా అందందే కలడు” అనే తెలుగు పద్యం మాదిరి జగన్ పాలన వ్యవస్థకు అద్దం పడుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. జగన్ ప్రభుత్వంలో ఎందెందు వెతికి అందందు టాక్స్ లే కనపడుతున్నాయనేది సామాన్యుడి ఆవేదన.
చెత్త మీద టాక్స్ వేసిన చెత్త ముఖ్యమంత్రి అంటూ టీడీపీ బాహాటంగానే విమర్శిస్తుండగా; ఈ టాక్స్ ల బాదుడేంటని ప్రజలు బలంగా ప్రశ్నిస్తున్నా, ప్రభుత్వం వెనక్కి తగ్గకపోగా కొత్తగా ‘పోల్ టాక్స్’ అంటూ మరో కొత్త జీవో ను ‘ఉగాది కానుక’గా రాష్ట్ర ప్రజానీకానికి వడ్డించడానికి సిద్ధమైంది జగన్ సర్కార్.
కరెంటు స్తంభానికి కేబుల్ వైర్ చుడితే చాలు వారిపై ఈ పోల్ టాక్స్ అప్లై అయిపోతుంది. ఈ జీవో కారణంగా కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఆర్ధికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామని కేబుల్ ఆపరేటర్ల సంఘం నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పోల్ టాక్స్ కు కూడా స్లాబ్ సిస్టం ఆధారంగా గ్రామాలలో; మండలంలో; నగరాలలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్లాబ్ విధానాన్ని అమలుచేస్తామని చెప్పి ప్రభుత్వం పోల్ టాక్స్ జీవోని ఇష్యూ చేసింది. జగన్ తన పాదయాత్ర సమయంలో తనను కలసిన కేబుల్ఆపరేటర్లకు ‘నేనున్నాను… నేను వస్తాను’ మీ సమస్యలను పరిష్కరిస్తాననే హామీ ఇచ్చి ఇప్పుడు ఈ పోల్ టాక్స్ రూపంలో మరో భారం తమపై మోపారని ఆందోళనలో ఉన్నారు కేబుల్ ఆపరేటర్లు.
ప్రభుత్వం ఏ వ్యాపార వర్గాల మీద ఎన్ని టాక్స్ లు వేసిన చివరికి ఆ టాక్స్ ల భారం మోయవలసింది సామాన్య – మధ్య తరగతి ప్రజానీకమే అనేది ప్రభుత్వాలు ఎప్పటికి గ్రహిస్తాయో అంటూ నిట్టూరుస్తున్నారు మధ్యతరగతి ప్రజలు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు “బాదుడే…. బాదుడు” అంటూ వ్యంగ్యంగా విమర్శించిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడేం బదులిస్తారు అంటూ సాగదీస్తున్నారు టీడీపీ నేతలు.