YS Jaganఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో అతి త్వరలో నేను విశాఖకి షిఫ్ట్ అవుతున్నాను అని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ మాట ఫిభ్రవరిలో చెప్పారు. ఈనెల మళ్ళీ విశాఖలో జరిగిన సదస్సులో విశాఖ రాజధానిగా ఉంటుందని, త్వరలోనే తాను విశాఖకు మకాం మారుస్తానని చెప్పారు. విశాఖ రాజధాని పేరు చెప్పుకొని సదస్సులో రూ.13.56 లక్షల కోట్లు పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాలు సాధించామని గొప్పగా చెప్పుకొన్నారు.

ఆ సదస్సు ముగిసింది… అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు… అన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయో రావో వైసీపీ నేతలకే బాగా తెలుసు. సదస్సు ముగిసింది కనుక ఇప్పుడు అత్యవసరంగా సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖకు బయలుదేరవలసిన అవసరం ఏమీ లేదు. ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో మార్చి, ఏప్రిల్ కాదు… జూలైలో విశాఖ మకాం మార్చుదామని చెప్పారు. అంటే ఉగాది ముహూర్తం పక్కన పడేసిన్నట్లే! జూలైలో విజయదశమికి అంటే అక్టోబర్ 24న బయలుదేరుదామన్నా ఆశ్చర్యపోనక్కరలేదు.

సిఎం జగన్మోహన్ రెడ్డి అసలు విశాఖకి మకాం మార్చడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు? అని ప్రశ్నించుకొంటే సుప్రీంకోర్టులో కేసు వలననే అని చెప్పవచ్చు. ఈ కేసు పలు క్లిష్టమైన అంశాలతో ముడిపడి ఉందని, కనుక లోతుగా విచారణ జరిపితే కానీ ఏపీకి పూర్తి న్యాయం చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనుక ఈ కేసు విచారణ కోసం ఏపీ ప్రభుత్వం ఎంత తొందరపెట్టినా తమకు తొందరపడే ఉద్దేశ్యం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది.

కనుక ఏపీకి అమరావతి రాజధానిగా ఉండాలా లేదా మూడు రాజధానులు ఉండాలా?అని సుప్రీంకోర్టు విచారణ చేస్తున్నప్పుడు, సిఎం జగన్మోహన్ రెడ్డి విశాఖకు మకాం మార్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించడం అంటే కోర్టు ధిక్కారమే అవుతుంది. బహుశః అందుకే ఏకంగా జూలైకి వాయిదా వేసి ఉండవచ్చు.

ఒకవేళ ఈలోగా సుప్రీంకోర్టు మూడు రాజధానులకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా మకాం మార్చేయడం ఖాయం. ఒకవేళ జూలైలోగా తేల్చకపోతే ఎలాగూ అప్పటికి ఎన్నికలు దగ్గర పడతాయి. ఆ కోలాహలంలో అందరూ కొట్టుకుపోతుంటారు కనుక మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తే తాము అధికారంలోకి రాగానే విశాఖ రాజధాని, కర్నూలు న్యాయరాజధాని అంటూ ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రజలకు ఆశ చూపవచ్చు.