AP Government Roads Damage Issueఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల స్థితిగతుల గురించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూలంకుషంగా స్పందించారు. ప్రస్తుతం రోడ్లు ఇలా ఉండడానికి కారణం మూడేళ్ళ క్రితం అధికారానికి దూరమైన తెలుగుదేశం ప్రభుత్వమని జగన్ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు హయాంలో రోడ్ల నిర్వహణ అస్సలు పట్టించుకోలేదని, ఆ తర్వాత రాష్ట్రంలో వర్షాలు బాగా రావడంతో మరింతగా దెబ్బ తిన్నాయని అన్నారు. అయితే మా ప్రభుత్వ హయాంలోనే రోడ్లన్నీ పాడైపోయినట్లు విష ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా రహదారుల మరమ్మత్తులకు, నిర్మాణాలకు 2205 కోట్లు కేటాయించామని, రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఏనాడూ ఖర్చు చేయలేదని, రహదారుల నిర్మాణాలకు తాము ఎంత శ్రద్ధ చూపుతున్నామో ఇదొక ఉదాహరణగా తెలిపారు ముఖ్యమంత్రి.

ముందుగా… రహదారుల నిమిత్తం 2205 కోట్లు భారీగా కేటాయించిన మాట వాస్తవమే, జగన్ చెప్పినట్లుగా ఒక్క ఏడాదిలో ఇంత పెద్ద మొత్తం ఏ ప్రభుత్వం కేటాయించలేదు. కానీ నేడు అంతగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందంటే, దాదాపుగా రాష్ట్రంలో రోడ్లన్నీ నిర్వీర్యం అయిపోయాయని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పకనే చెప్పారు.

అధికారం చేపట్టి దాదాపుగా మూడేళ్లు కావస్తున్నా, రహదారుల వంటి చిన్న చిన్న అంశాలలో కూడా ఇంకా తెలుగుదేశం ప్రస్తావన తీసుకువస్తున్నారంటే ముఖ్యమంత్రిగా ఈ మూడేళ్ళ పాటు జగన్ ఏం చేశారన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఇది ఒక సీఎంగా జగన్ సమర్ధతను నిలదీసే అంశంగా మారుతుంది.

ఈ మూడేళ్లలో వర్షాల వలనో లేక ఇంకే ఇతర కారణాల వలనో పాడైన రోడ్లకు త్వరితగతిన మరమ్మత్తులు చేపట్టి ఉంటే నేడు 2205 కోట్లు ఒకేసారి ఖర్చు చేయాల్సిన అవసరం వచ్చేది కాదేమో!? కనీసం రాష్ట్రంలో గుంతలు పూడ్చిన ట్రాక్ రికార్డును కూడా జగన్ సర్కార్ కు లేకపోవడంతో, ఒకానొక దశలో జనసేన ఈ కార్యక్రమాన్ని నెత్తికెత్తుకుని ప్రధాన రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చింది.

ఇక ఆంధ్రప్రదేశ్ రోడ్లను తెలుగుదేశం పట్టించుకోలేదన్న ఆరోపణ అత్యంత హాస్యాస్పదంగా మారింది. ప్రజలు అడగకుండానే మా నాయకుడు చంద్రబాబు విజన్ మేరకు గ్రామగ్రామాన సిమెంట్ రోడ్లు వేసి చేతులు కాల్చుకున్నామని ఇటీవల ఓపెన్ విత్ ఆర్కే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని చేసిన వ్యాఖ్యలకు భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

రాజకీయంగా విమర్శలు – ప్రతి విమర్శలు సహజమే గానీ, ఏ విమర్శలో అయినా నిజాయితీ ఉంటే అది ప్రజల చెంతకు చేరుతుంది. బహుశా ఎవరినైనా ఒకటి, రెండు సార్లు మోసం చేయొచ్చు గానీ, నిత్యం చేయలేమని గత చరిత్ర చెప్తుంది. అందులోనూ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, అసత్యపు విమర్శలు చేయడం ఆ స్థాయిని దిగజార్చే అంశంగా పరిగణించవచ్చు.

తెలుగుదేశం పార్టీని ఏ అంశంలో అయినా విమర్శించవచ్చు గానీ, రహదారుల వంటి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మాత్రం దేశానికే దిక్సూచి లాగా చంద్రబాబు రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారన్న విషయం తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఏపీలో రోడ్ల స్థితిగతులు గురించి 3 వేల కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసిన జగన్ కంటే ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. నిజంగా అప్పుడే రోడ్లు అధ్వానంగా ఉంటే, ఈ అంశంపై ఒక్క విమర్శ కూడా ఎందుకు చేయలేదో?!