Ap government agreement with byjus companyఏపీలో విద్యావ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రయోగానికి సిద్దం అవుతోంది. రాష్ట్రంలో పాఠశాలలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్దులందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు బైజూస్ కంపెనీతో ఒప్పందం చేసుకొంది. రూ.20-24,000 ఖరీదు చేసే పాఠ్యాంశాలను విద్యార్దులకు బైజూస్ ఉచితంగా అందజేస్తుంది.

వీడియోలలో యానిమేషన్ ద్వారా పాఠ్యాంశాలను భోదిస్తారు కనుక విద్యార్దులు సులువుగా అర్ధం చేసుకొని చదువులలో రాణించగలుగుతారు. బైజూస్ పాఠ్యాంశాలలో ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులను తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలో భోదిస్తారు. పదో తరగతిలో సీబీఎస్సీ పరీక్షలు వ్రాసేందుకు వీలుగా బైజూస్ పాఠ్యాంశాలను రూపొందించింది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో బైజూస్ విద్యావిధానం ద్వారా విద్యార్దులకు భోధన జరుగుతోంది. కనుక ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్దులకు కూడా ఖరీదైన ఈ విద్యాబోధనా విదానం అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమైన విషయమే.

అయితే ఇప్పటికే ఇంగ్లీషు మీడియంతో ఒత్తిడికి గురవుతున్నవిద్యార్దులను, ఉపాధ్యాయులను ఇది మరింత ఒత్తిడికి గురి చేస్తుందా లేదా మేలు చేస్తుందా?అనేది వచ్చే ఏడాది ఫలితాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఒకవేళ దీనితో విద్యార్దులకు మేలు కలిగితే చాలా మంచిదే. కానీ ఈ ప్రయోగం బెడిసికొడితే రాష్ట్రంలో 4 నుంచి 10వ తరగతి వరకు చదువుకొంటున్న 32 లక్షల మంది విద్యార్దుల చదువులు దెబ్బ తింటాయి.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలలో స్టేట్ సిలబస్ భోదిస్తుంటారు. కనుక అందుకు తగ్గ పాఠ్యాంశాలు రూపొందించి రాష్ట్ర స్థాయిలోనే పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పుడు బైజూస్ ప్రవేశంతో ‘స్టేట్ సిలబస్’ పక్కన పడేసి సెంట్రల్ సిలబస్‌ ప్రకారం విద్యార్దులకు శిక్షణ ఇవ్వబోతున్నట్లు అర్ధమవుతోంది.

దీంతో ఉన్నత విద్యలు అభ్యసించడానికి, జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలలో పాల్గొనేందుకు విద్యార్దులు అన్నివిధాల సిద్దం అవుతారని ప్రభుత్వం, బైజూస్ చెపుతోంది. మంచిదే! కానీ స్టేట్ సిలబస్ పక్కన పడేసి సెంట్రల్ సిలబస్‌ భోదిస్తే విద్యార్దులకు మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గురించి ఏమి తెలుసుకొనే అవకాశం ఉండదు కదా?

ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొనే పిల్లలకు అత్యుత్తమమైన విద్య అందించాలనే ఆలోచన మంచిదే. కానీ అంతకంటే ముందు వారి కుటుంబ ఆర్ధిక, సామాజిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. వాటిని పట్టించుకోకుండా ఇటువంటి ప్రయోగాలు చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయా రావా?ఈ నూతన విద్యాబోధనపై ప్రభుత్వోపాధ్యాయులు ఏమంటున్నారు? దీంతో వచ్చే లాభాలు ఏమిటి? వచ్చే సమస్యలు ఏమిటి? అని లోతుగా అధ్యయనం చేయడం చాలా అవసరం.

ఈ ప్రయోగం విజయవంతం అయితే మంచిదే కానీ బెడిసి కొడితే ఒకేసారి 32 లక్షల మంది విద్యార్దులు నష్టపోతారు. కనుక అన్ని పాఠశాలలో ఒకేసారి కాకుండా వెనుకబడిన కొన్ని పాఠశాలను ఎంపిక చేసుకొని ప్రయోగాత్మకంగా బైజూస్ పద్దతిలో విద్యాబోధన చేస్తే బాగుంతుంది.

ముఖ్యంగా దీని గురించి ప్రభుత్వోపాధ్యాయులకు మాట మాత్రంగానైనా చెప్పకుండా వారిచేతే విద్యార్దులపై ఈ ప్రయోగం చేయించాలనుకోవడం సరికాదనే అనిపిస్తోంది. మరి దీనిపైప్రభుత్వోపాధ్యాయులు విద్యార్దుల తల్లితండ్రులు ఏమంటారో?