AP Employees Salariesఏపీలో ప్రతీనెల 15వ తేదీ వరకు ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల చెల్లింపు ప్రక్రియ ఇప్పుడు సర్వసాధారణమైన విషయం అయిపోయింది. కనుక ఎప్పుడైనా మొదటివారంలోగా అందరికీ జీతాలు పడితే అది చాలా గొప్పవార్త! అదే… 1వ తేదీన ఇచ్చేస్తే… ఇంకా గొప్ప వార్త అవుతుంది కదా? అలాంటి గొప్ప పని చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. ఈసారి ఏప్రిల్ 1వ తేదీనే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులందరికీ జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, “సంక్షేమ పధకాలకు నిధులు సర్ధుబాటు చేస్తుండటం వలన ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపు ఆలస్యం అవుతోంది తప్ప ప్రభుత్వానికి ఎటువంటి దురాలోచన లేదు. కానీ కొందరు దీనిపై కూడా రాజకీయలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. కనుక ఈసారి ఏప్రిల్ 1వ తేదీనే అందరికీ జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ సంఘాల నేతలకు ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెలాఖరులో రూ.3,000 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌లోగా పీఆర్సీ బకాయిలను రెండు విడతలలో చెల్లిస్తుంది.

Also Read – ఏపీకి రివర్స్ గేర్ పడి నేటికీ సరిగ్గా 5 ఏళ్ళు!

రాష్ట్రానికి వార్షిక ఆదాయం రూ.1.25 లక్షల కోట్లు కాగా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల జీతలకే రూ.90,000 కోట్లు వెళ్లిపోతోంది. ఇవి కాక ఉద్యోగుల ఇంక్రిమెంట్స్ వగైరాలకు మరో రూ.8,000 కోట్లు ఖర్చవుతుంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నడూ అన్యాయం చేయాలనుకోలేదు. సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తోంది. కనుక దీని గురించి లేనిపోని అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

మంత్రుల సబ్ కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు చాలా సానుకూలంగా సాగాయి. బొప్పరాజు వెంకటేశ్వర్లుతో సహా చర్చలలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ మళ్ళీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలనుకొంటున్నారో వారికే తెలియాలి. ఈ నెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్ధులకె ఉద్యోగులు అందరూ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

Also Read – టిడిపి పోలిటికల్ ర్యాగింగ్… మామూలుగా లేదుగా!

సంక్షేమ పధకాలకు నిధులు సర్దుబాటు కోసమే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపు ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తరపున చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా ధృవీకరించడంతో ఉద్యోగుల జీతాల చెల్లింపు కంటే ప్రభుత్వానికి సంక్షేమ పధకాలకు చెల్లింపుకే ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టమవుతోంది.

ఏదో ఒకటి రెండు నెలలు ఇలా జరిగిందంటే ఉద్యోగులు కూడా అడగరు కానీ ప్రతీనెల ఇదే తంతు అంటే వారూ విసుగెత్తిపోయి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కానీ ఆవిదంగా అడగడం కూడా తప్పన్నట్లున్నాయి చంద్రశేఖర్ రెడ్డి మాటలు. సకాలంలో జీతాలు చెల్లిస్తే ఎవరైనా ప్రభుత్వాన్ని ఎందుకు వేలెత్తిచూపుతారు?ఉద్యోగులు బకాయిలు, జీతాలు, ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యమించడానికి సిద్దమై కార్యాచరణ ప్రకటించారు కనుకనే ప్రభుత్వం దిగివచ్చి హడావుడిగా రూ.3,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది లేకుంటే చెల్లించేదా? ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈనెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు ఆయనే బయటపెట్టుకొన్నారు కదా?మిగిలిన బకాయిల చెల్లింపుకు ఆరు నెలల గడువు తీసుకొంది. బహుశః అప్పుడు ఎన్నికల గంట మ్రోగితే ఆ సొమ్ము చెల్లించేసి మళ్ళీ వైసీపీనే గెలిపించాలని కోరాలనుకొంటోందేమో?

Also Read – కడప కబుర్లు: వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారట!