ప్రభుత్వాలను నడిపేవి రాజకీయ పార్టీలే కనుక వాటి నిర్ణయాలలో కొన్నిటికి రాజకీయ కారణాలు లేదా రాజకీయ ఉద్దేశ్యాలు ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ ఏపీలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావును ప్రభుత్వం రెండేళ్ళుగా సస్పెండ్ చేయడం. దానికి ప్రభుత్వం వేరే కారణాలు చూపుతునప్పటికీ, ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో ఆయనకు విధేయంగా పనిచేయడమే అసలు కారణమని అందరికీ తెలుసు.
కనుక నిబందనలకు విరుద్దంగా రెండేళ్ళ నుంచి ఆయనపై సస్పెన్షన్ కొనసాగిస్తోంది వైసీపీ ప్రభుత్వం. దానిపై ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళగా వైసీపీ ప్రభుత్వం కూడా ఆయనను ఎదుర్కొనేందుకు కోట్లాది రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసింది. అయినా చివరికి సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పి వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆయన వ్యవహారంలో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేసినా చివరికి హైకోర్టు, సుప్రీంకోర్టులలో ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పలేదు. ఆయనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తే చివరికి వైసీపీ ప్రభుత్వమే దోషిగా నిలబడాల్సి రావడం జీర్ణించుకోవడం కష్టమే.
కనుక సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడి వారం రోజులైనా ఇంతవరకు ఆయనను విధులలోకి తీసుకోలేదు. దాంతో ఆయనే స్వయంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసి తనను విధులలోకి తీసుకోవాలని కొరేందుకు బుదవారం ఆయన కార్యాలయానికి అపాయింట్మెంట్ తీసుకొని మరీ వెళ్ళారు.
సమీర్ శర్మ కూడా ఐఏఎస్ అధికారే. కనుక తన స్థాయి ఐపీఎస్ అధికారి వచ్చినప్పుడు ఏవిదంగా వ్యవహరించాలో ఆయనకు బాగా తెలుసు. కానీ వెంకటేశ్వరరావును బయటే కూర్చోబెట్టారు తప్ప కలవలేదు. చివరికి ఆయనను కలవకుండానే బయటకు వెళ్ళిపోయారు.
ఎందుకంటే, వేంకటేశ్వర రావు ఎంత సీనియర్ అధికారి అయినప్పటికీ, ఆయన సిఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురైన వ్యక్తి కనుక. ముఖ్యమంత్రి వద్దనుకొన్న అధికారిని మళ్ళీ విధులలో తీసుకోవడం మాట అటుంచి ఆయనతో మాట్లాడినా తాను కూడా సిఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురి కావలసి వస్తుందనే భయం కావచ్చు. కనుక ముఖ్యమంత్రికి ఈవిషయం తెలియజేసి ఆయన ఆదేశానుసారం వ్యవహరించే అవకాశం ఉంది.
అయితే సుప్రీంకోర్టు ఆదేశించినా వేంకటేశ్వర రావును విధులలోకి తీసుకోకుండా ఈవిదంగా అవమానిస్తే ఆయన మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఖాయం. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులు కోర్టు ధిక్కార నేరానికి హైకోర్టు జరిమానాలు విధించి, జైలుకి పంపించేందుకు సిద్దపడింది. కనుక ఏబీ వేంకటేశ్వరరావు విషయంలో వైసీపీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే మళ్ళీ అదే జరుగవచ్చు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు సుప్రీంకోర్టులో అటువంటి చేదు అనుభవం ఎదురుకావచ్చు.
రాజకీయ కారణాలతో పాలకులు తీసుకొనే నిర్ణయాలకు మద్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇటువంటి అవమానాలు భరించవలసి వస్తుండటం చాలా బాధాకరమే. కానీ కోర్టులలో మొట్టికాయలు వాళ్ళకే పడుతున్నాయి తప్ప ముఖ్యమంత్రి, మంత్రులకు కాదు కనుక వారి బాధ అర్ధం కావడం లేదనుకోవాలేమో?