రాజుగారు తలుచుకొంటే… అన్నట్లు ఈరోజు ఉదయం విశాఖలో చాలా అట్టహాసంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభమైంది. విశాఖ రాజధాని విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బలు… వివేకా హత్య కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులలో వైసీపీ ఎంపీలకి సీబీఐ నోటీసులతో తీవ్ర అప్రదిష్ట మూటగట్టుకొన్న వైసీపీ ప్రభుత్వానికి వాటిపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
విశాఖ రాజధాని కాకపోతే ఉత్తరాంద్ర జిల్లాలు ఎన్నటికీ అభివృద్ధికి నోచుకోవని వితండవాదం చేస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావుకి ఈ సదస్సు అనవసరమే అని భావించవచ్చు. కానీ ఈ ఒక్క సదస్సుతోనే రాష్ట్రానికి దాదాపు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, వాటితో వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ చెపుతున్న రాష్ట్ర పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నా థ్ రెడ్డికి ఈ సదస్సు విజయవంతం కావడం చాలా అవసరం. లేకుంటే కోడి-గుడ్డు మంత్రి అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేయకమానవు.
మూడున్నరేళ్ళుగా అభివృద్ధిని మరిచి, సంక్షేమ పధకాలు, మూడు రాజధానులతో కాలక్షేపం చేసేసిన వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల సంవత్సరంలో ఈ సదస్సులో ఎంతో కొంత పెట్టుబడులు రాబట్టుకోగలిగితే ప్రజలకి ఏమైనా చెప్పుకోగలుగుతుంది. పెట్టుబడులు వచ్చినా రాకపోయినా కనీసం ఒప్పందాలు (ఎంవోయు) చేసుకొని, దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఫోటోలు దిగడం ఖాయమే కనుక వైసీపీ ప్రభుత్వానికి ఇది చాలా ఊరట కలిగిస్తుందని చెప్పవచ్చు.
కానీ ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లు ఎంవోయులు చేసుకొన్న కంపెనీలన్నీ, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులని చూడకుండా ఈ హడావుడి, హంగామా చూసి వేలకోట్లు పెట్టుబడులు పెట్టేసి పరిశ్రమలు స్థాపించేస్తాయనుకోవడం అజ్ఞానమే అవుతుంది. ఎందుకంటే, ఏడాదిలోగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్నాయి. గత ప్రభుత్వం చేసుకొన్న ఒప్పందాలను ఈ ప్రభుత్వం గౌరవించకుండా రద్దు చేయడమో, తిరగవ్రాసుకోవడమో చేసినప్పుడు, ఎన్నికల ముందు ఈ ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందాల పరిస్థితి ఏమిటని ఆలోచించకుండా ఉంటాయా?
అమరావతా… విశాఖా లేదా మూడు రాజధానులా అని చూడకుండానే పెట్టుబడులు పెట్టేస్తాయా? రాష్ట్రంలో విద్యుత్ కోతలు, వైసీపీ నేతల ఒత్తిళ్ళు, రాష్ట్రంలో ఐటి కంపెనీలు మూతపడటం వంటివన్నీ పరిగణనలోకి తీసుకోకుండా పెట్టుబడులు పెట్టేస్తారా? రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ప్రభుత్వ ఆలోచనా సరళి, దాని పారిశ్రామిక విధానాలని నిశితంగా పరిశీలించకుండా పరిశ్రమలు స్థాపించేస్తాయా?అంటే కాదనే వైసీపీ నేతలు కూడా చెప్పుకోవలసి ఉంటుంది.
ఒకవేళ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి చెప్పుకొంటున్నట్లు జగన్ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకంతో రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్దపడినా, మిగిలిన ఈ పుణ్యకాలంలో ఆ పరిశ్రమల ఏర్పాటుకి ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించగలదా?ప్రభుత్వపరంగా జరగాల్సిన పేపర్ వర్క్స్, ఆమోదాల ప్రక్రియని పూర్తి చేయగలదా?అంటే కడప ఉక్కు ఫ్యాక్టరీయే సమాధానంగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకొన్న కడప ఉక్కు కర్మాగారానికి, నాలుగేళ్ళు పూర్తికావస్తున్నా శంకుస్థాపనలే తప్ప ఇంతవరకు నిర్మాణపనులు మొదలుపెట్టనే లేదు. కనుక ఈ రెండు రోజుల సదస్సులో చేసుకోబోయే ఎంవోయూల పరిస్థితి ఏమిటో అర్దం అవుతోంది.
ఏది ఏమైనప్పటికీ, ఈ సదస్సు విజయవంతం అవ్వాలని రాష్ట్రానికి రెండు లక్షల కోట్లు పెట్టుబడులు, వాటితో పరిశ్రమలు, వాటితో వేలాదిమందికి ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొందాము.