AP-Finance-minister-buggana-rajendranath-reddyఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దొరికిన చోటల్లా అప్పులు చేస్తోందని, ఏడాది వ్యవధిలో తీసుకోవలసిన అప్పులో సగం సొమ్ముని మొదటి మూడు నాలుగు నెలల్లోనే తీసుకొని వాడేసుకొందని కేంద్ర ఆర్ధికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి నికర రుణపరిమితి కింద రూ.44,754 కోట్లు అప్పులకు కేంద్రం అనుమతిస్తే ఏపీ ప్రభుత్వం మొదటి నాలుగు నెలల్లోనే రూ.21,890 కోట్లు తీసి వాడేసుకొందని పంకజ్ చౌదరి చెప్పారని ఈనాడులో ఓ వార్త వచ్చింది.

దానిపై రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో తన కార్యాలయంలో (సాక్షి) మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభలో వివిద రాష్ట్రాల అప్పుల గురించి పంకజ్ చౌదరి వివరిస్తే, ఒక్క ఏపీ మాత్రమే అప్పులు చేస్తోందన్నట్లు తప్పుడు వార్తలు ప్రచురించడం సరికాదని చెపుతూ ఏపీ, ఇతర రాష్ట్రాల అప్పుల గణాంకాలను వివరించి, వాటితో పోలిస్తే ఏపీ చాలా తక్కువ అప్పులు చేస్తోందని వాదించారు. అయితే తమ ప్రభుత్వం ఈ మూడేళ్ళలో ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసిందో చెప్పకుండా, ఇంత శాతం.. అంత శాతం… స్థూల ఉత్పత్తి… అంటూ అప్పులను దాచిపెట్టే ప్రయత్నం చేయడం గమనిస్తే ఎవరైనా సరే బుగ్గన వేలు పెట్టుకోవాల్సిందే!

“ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే అప్పులు చేయడం లేదు దేశంలో అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి… వాటి కంటే ఏపీ ప్రభుత్వం చాలా తక్కువ అప్పులు చేస్తోందని” మంత్రి బుగ్గన సమర్ధించుకొన్నారు. అప్పులు చేయడం తప్పు కాదు కానీ వాటిని రాష్ట్రాభివృద్ధికి వినియోగించి సంపద సృష్టించగలిగితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మెచ్చుకొంటున్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డిను కూడా ప్రజలు మెచ్చుకొని ఉండేవారు.

కానీ లక్షల కోట్లు అప్పులు చేసి కనీసం రాష్ట్రంలో రోడ్లు కూడా వేయించ లేకపోతున్నారు. పోనీ అప్పు తెచ్చిన సొమ్మంతా సంక్షేమ పధకాలకే ఖర్చు చేస్తోందా అంటే అదీ లేదు. సంక్షేమ పధకాలలో కూడా కోతలు విధిస్తోంది. కనుక ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా జగన్ ప్రభుత్వాన్ని ఆ డబ్బు అంతా ఏమైపోతోందని నిలదీయడం సహజమే.

ఒకవేళ మంత్రి బుగ్గన నిజయతీగా సమాధానం చెప్పే ధైర్యం ఉంటే ఈ మూడేళ్ళలో తమ ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేసింది? దానిలో ఎంత సొమ్ము దేని కోసం ఖర్చు చేసింది? అనే లెక్కలు చెపితే సరిపోయేది. కానీ చేస్తున్న లక్షల కోట్ల అప్పులను దాచిపుచ్చుతూ మీడియాను నిందించారు. కానీ అప్పుల నిప్పు కణికని బుగ్గన ఎంతకాలం జేబులో దాచుకోగలరు?దాచుకొంటే ఈవిదంగా పొగలు రాకుండా ఉంటాయా?