TDP 2024 Statusఏదైనా ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు కొంత కాలం ఇబ్బంది ఉండదు. ఓటమి కారణంగా ప్రతిపక్షం కూడా కొంత కాలం సైలెంట్ గా ఉంటుంది. అలానే కొత్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే ప్రతిపక్షానికి జరిగే మేలు కంటే కీడే ఎక్కువ.

అందుకని కొత్త ప్రభుత్వ పాలనలో మొదటి రెండు మూడేళ్లు పాలక పక్షానికి హానీ మూన్ పీరియడ్ అన్నట్టు. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం ఇది పూర్తి భిన్నం. రెగ్యులర్ గా వివాదాస్పద నిర్ణయాలతో జగన్ మొదటి నుండి వార్తల్లో నెగటివ్ గా నిలిచిన వ్యక్తే.

అసలు వైఎస్సార్ కాంగ్రెస్ కు హనీ మూన్ పీరియడ్ అనేదే లేదు. లేదు అనే కంటే అసలు ఇచ్చే అవకాశం జగన్ ఇవ్వలేదు అనే చెప్పాలి. తాజాగా గుడివాడలో క్యాసినో, ఉద్యోగుల సమ్మె గొడవ తో ప్రతిపక్షానికి మరో అవకాశం ఇచ్చారు జగన్.

అయితే అంతా ప్రతిపక్షానికి అనుకూలమేనా అంటే… ఆలోచించాల్సిందే. ఎన్నికలకు రెండేళ్ల సమయం మాత్రమే ఉన్నా టీడీపీ ఇంకా ఎన్నికల మూడ్ లోకి రాలేదు. కోవిడ్ కారణంగా చెబుతూ చంద్రబాబు, లోకేష్ ఎక్కువగా హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారు.

చాలా నియోజకవర్గాలలో నేతలు కూడా నిద్రావస్థలోనే ఉన్నారు. జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే అయితే మేము ఏమీ చెయ్యకపోయినా ఆటోమేటిక్ గా ప్రజలు గెలిపించేస్తారు అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్టే.

పది రోజులలోనే రాజకీయాలు పూర్తిగా మారిపోయే కాలంలో రెండేళ్లు అనేది చాలా పెద్ద సమయం. ప్రజలలో ఉండి, క్షేత్ర స్థాయిలో నాయకులను, క్యాడర్ ను ఉత్తేజపరిచి… అన్ని వైపుల నుండీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే తప్ప జగన్ ను ఓడించడం తేలిక గాదని చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ తెలుసుకోవాలి.

సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలలో ఉన్న చంద్రబాబుకు ఇది తెలియనిది కాదు. 2012 ఉపఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ కు అనూహ్య విజయం తరువాత 2014 లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే చంద్రబాబు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చేసిన సుదీర్ఘ పాదయాత్రకు అప్పటి పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి.

2024కు ఏం చెయ్యాలి అనేది అప్పటి అనుభవం నుండే పాఠాలు నేర్చుకోవాలి.