ap employees salary in new 2000 rupees notesపెద్ద నోట్ల రద్దు కష్టాలు ప్రభుత్వ ఉద్యోగులను కూడా తాకాయి. నోట్లను మార్పిడి చేసుకోవాలన్నా, ఏటీఎంల నుండి డబ్బులను డ్రా చేసుకోవాలన్నా గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడడం తమకు సాధ్యం కాదు కాబట్టి, కొంత మొత్తాన్ని చలామణి అవుతున్న నోట్ల రూపంలో చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసుకున్న విజ్ఞప్తికి, చంద్రబాబు సర్కార్ సానుకూల నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించి 10 వేల రూపాయలను నగదు రూపంలో చెల్లించేందుకు ఏపీ సర్కార్ ఇప్పటికే జీవో జారీ చేయగా, తాజాగా తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమకు ఇదే రకమైన సదుపాయం కావాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే 10 వేల రూపాయలు కాకుండా, నవంబర్ నెల మొత్తం వేతనం నగదు రూపంలో చెల్లించాలని వినతిపత్రాన్ని సమర్పించారు.

తెలంగాణా ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ కూడా దీనికి సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల టాక్. ఈ నోట్ల రద్దు వలన ఎదురవుతున్న ఇబ్బందులను ప్రధాని మోడీ ముందు పెట్టిన కేసీఆర్, తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగులు కూడా భావిస్తున్నారు. ఏపీలో 10 వేలు నగదు రూపంలో ఇవ్వడంతో, ఇక్కడ ఎంత మొత్తంలో నగదు రూపంలో ఇస్తారన్నదే ఉద్యోగులకు ఆసక్తిగా మారింది.