AP Employees Protest On Jagan Sarkarతమ జీతభత్యాల అంశంలో, పీఆర్సీ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాడతామని ఏపీ సర్కార్ పై దండయాత్ర షురూ చేసారు ఉద్యోగులు. మొదట విడత నిరసనలతో భాగంగా నేడు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కర్నూల్ వేదికగా ఈ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మీడియాతో తమ ఆవేదనను వెలిబుచ్చారు.

ప్రభుత్వం తమను రెచ్చగొట్టేలా చేస్తున్నప్పటికీ, ప్రజాప్రయోజనాల రీత్యా సంయమనం వహిస్తూ వస్తున్నామని, పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, మొక్కుబడిగా ఒకటి, రెండు సమావేశాలు జరిపి చేతులు దులుపుకోవడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. అయినా పీఆర్సీ నివేదికను అసలు ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని, అంత భయమెందుకని నిలదీశారు.

అలాగే ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు, ఏపీ ఐకాస ఛైర్మెన్ బండి శ్రీనివాసరావు కూడా ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసారు. తొలిదశలో నిరసనలను ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో, ఇవి మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు. 210 సంఘాల తరపున 13 లక్షల ఉద్యోగులు ఉన్నారని, ప్రభుత్వాన్ని నిలబెట్టడమే కాదు, కూల్చడం కూడా చేతవునని అన్నారు.

అధికారం చేపట్టిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని, ఇపుడు మీనమేషాలు లెక్కిస్తున్నారని జగన్ తీరును ఎండకట్టారు. నిజానికి తాము ఉద్యమ బాట పట్టాలని లేదని, అందుకే ఇన్నాళ్ల పాటు నిరీక్షించామని, కానీ ప్రభుత్వమే తమను ఉద్యమ బాట పట్టేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇది మంత్రి స్థాయిలో అయ్యే విషయం కాదు గనుక ముఖ్యమంత్రితో భేటీకి మాత్రం ఏర్పాట్లు జరగడం లేదని అన్నారు.

ఉద్యోగులు చేస్తోన్న ఈ ఉద్యమాల పర్యవసానాలు ఎలా ఉంటాయోనని సామాన్య ప్రజలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే, గతంలో పది రూపాయల మాస్క్ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ పరిస్థితి ఏమయ్యిందో బహిరంగమే. ప్రభుత్వాన్ని నిలబెట్టడమే కాదు, కూల్చగల శక్తి కూడా ఉన్న ఉద్యోగుల హెచ్చరికలను జగన్ సర్కార్ ఖాతరు చేస్తుందా? ఉద్యోగుల డిమాండ్స్ ను పరిష్కరిస్తుందా?